జైకొవ్-డి వ్యాక్సిన్ల పంపిణీకి జైడస్ క్యాడిలా సన్నాహాలు చేస్తోంది. ఈనెలలో టీకా సరఫరా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కోటి డోసులను కేంద్రం ఆర్డర్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. ఈ టీకాను తొలుత పెద్దలకు అందజేయనున్నట్లు సమాచారం.
"ఒక కోటి జైకొవ్-డి టీకా డోసులను కేంద్రం ఆర్డర్ చేసింది. ఒక్కో డోసు ధర రూ.358(పన్ను మినహా)(Zycov-D Vaccine Price). ఇందులోనే ఇన్జెక్టర్ ధర కూడా ఉంటుంది. పరిమిత ఉత్పత్తి సామర్థ్యం వల్ల తొలుత పెద్దలకే టీకా పంపిణీ చేస్తాం. ఈ మేరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం" అని ఓ అధికారి తెలిపారు.
జైకొవ్-డి వ్యాక్సిన్(Zycov-D Zydus Cadila) దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావటం విశేషం. సూది లేకుండానే ఇన్జెక్టర్ సాయంతో జైకొవ్-డి వ్యాక్సిన్ అందిస్తారు. ఈ టీకా ఒక్కో డోసును(Zycov D Vaccine Dose) 28 రోజుల తేడాతో ఇస్తారు. ఆగస్టు 20న ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందింది.
జైడస్ రూపొందించిన జెట్ ఇన్జెక్టర్ ద్వారా 20వేల డోసులు అందించొచ్చు. ఈ టీకాను మూడు విడతల కింద 0, 28, 56 రోజులకు తీసుకోవాలి.
ఇదీ చూడండి: Covaxin: అమెరికాలోని పిల్లలకు కొవాగ్జిన్ టీకా?