పెట్రో ధరల తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. పన్నుల తగ్గింపుపై అవగాహనకు రావాలని అన్నారు. వీటిపై ఉన్న పన్ను కారణంగానే ప్రభుత్వాలకు ఆదాయం వస్తోందని, తగ్గిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందన్న ధర్మసంకటంలో పడిపోయామని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థను మార్చేలా బడ్జెట్
దేశ ఆర్థిక వ్యవస్థ దిశను మార్చేలా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి అన్నారు. సామ్యవాద వ్యవస్థలోనే ప్రజాసంక్షేమం సాధ్యమన్న భావనను తొలగించామని చెప్పారు. బడ్జెట్ ద్వారా సంపద సృష్టికర్తలు, ప్రజలకు గౌరవం ఇచ్చామని అన్నారు. భాజపా నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. 'ప్రస్తుత బడ్జెట్ ఈ దశాబ్దానికి చెందినది. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ప్రైవేటు రంగానికి స్వాగతిస్తున్నామని ఈ బడ్జెట్ స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు, ఏమేమి చేయగలదన్నది కూడా ఈ బడ్జెట్ వెల్లడించింది. సోవియట్ రష్యా అనుసరించిన సామ్యవాద సిద్ధాంతాలను మనం అమలుచేశాం. అవి దేశ ఆచార వ్యవహారాలకు సరిపోవు' అని అన్నారు.
'సంపద సృష్టికర్తలైన పారిశ్రామికవేత్తలు, పౌరులను అనుమానించబోమని చెబుతున్నాం. మీరు ధనాన్ని పెట్టుబడిగా పెట్టి, కష్టపడి వస్తువులు తయారు చేస్తుంటే దానిని మరో వ్యక్తి వచ్చి తనిఖీ చేయాల్సిన అవసరం ఏముంది' అని చెప్పారు. పన్నుల విధానంలోనూ మార్పులు చేసినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. అధికారులను కలవకుండానే ఆన్‌లైన్ ద్వారా సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. వారికి ఎలాంటి లంచాలూ ఇవ్వాల్సిన పనిలేదన్నారు. అయితే.. భవిష్యత్తులో వారు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అక్రమాలకు పాల్పడవచ్చేమోనని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ఉపసంహరణపై మాట్లాడుతూ తాము ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయబోమని, అయితే ప్రైవేటు రంగానికి అందులో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రైవేటు రంగం సమర్థంగా పనిచేస్తున్నప్పుడు పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. జీఎస్టీ వసూళ్లలో పురోగతి ఉండడం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సంకేతమని చెప్పారు.
ఇదీ చదవండి: నేడు భారత్ బంద్- నిరసనలో 40 వేల వాణిజ్య సంఘాలు