కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తుల(BSNL properties for sale 2021)ను అమ్మకానికి పెట్టింది. రాష్ట్ర, జిల్లా, ఏరియా కార్యాలయాల స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. టెలికాం ఆదాయం తగ్గిపోవడంతో ఆస్తులను విక్రయించడం(BSNL properties for sale 2021) లేదా అద్దెకు ఇచ్చి ఇతర మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది. ఇప్పటికే సింహభాగం ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిన బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం తాజాగా దేశవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని భూములను అమ్మకానికి పెట్టింది.
ఇందులో హైదరాబాద్ గచ్చిబౌలిలోని 10.96 ఎకరాల స్థలం (44344.16 చదరపు మీటర్లు) విక్రయించనుంది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్ర కార్యాలయం(BSNL head office) నుంచి తెలంగాణ సీజీఎంకు ఇప్పటికే లేఖ అందింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులు, టెలికం సిబ్బందికి ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా కొనసాగుతున్న ఈ స్థలాన్ని లీజుకు ఇవ్వాలని గత కొంతకాలంగా బీఎస్‌ఎన్‌ఎల్(BSNL properties for sale 2021) ప్రయత్నిస్తోంది. తాజాగా గచ్చిబౌలి భూమిని విక్రయించి నిధులు సమీకరించాలని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) నిర్ణయించింది.
బ్యాంకులు, ప్రైవేటు సంస్థలకు లీజు..
తెలంగాణ సర్కిల్ పరిధిలో హైదరాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ టెలికం జిల్లాలు ఉన్నాయి.వీటి పరిధిలోని ఎక్స్ఛేంజిల ద్వారా వినియోగదారులకు సేవలు లభించేవి. ప్రైవేటు సంస్థల పోటీతో ప్రస్తుతం కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఫిర్యాదు కేంద్రాలు మూతపడ్డాయి. కేవలం సర్వర్ల నిర్వహణ మాత్రమే కొనసాగుతోంది. బ్రాడ్‌బ్యాండ్(BSNL broadband service) సేవలను ప్రైవేటు సంస్థలు, ఔత్సాహికులకు ఫ్రాంచైజీల రూపంలో అప్పగిస్తోంది. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని ఆ కార్యాలయ స్థలాలను లీజు పద్ధతిన అప్పగించాలని నిర్ణయించి తెలంగాణ సర్కిల్ టెండర్లు జారీ చేసి, ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు ఆహ్వానిస్తోంది.
హైదరాబాద్ టెలికాం జిల్లా పరిధిలోని ఆదర్శ్‌నగర్, సైఫాబాద్, చర్లపల్లి, నాచారంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయాల్లో కొన్ని అంతస్తుల నిర్మిత స్థలాన్ని లీజుకు పెట్టింది. చార్మినార్, చాంద్రాయణగుట్ట ఎక్స్ఛేంజి కార్యాలయాలను పూర్తిగా లీజుపై అప్పగించనుంది. చార్మినార్ కార్యాలయం నిర్మిత స్థలం 30 వేల చదరపు అడుగులు కాగా, సైఫాబాద్‌లో 20 వేల చ.అడుగులు, ఆదర్శ్‌నగర్‌లో 43 వేల చ.అడుగులు, చర్లపలిలో 26 వేల చ.అడుగుల స్థలం ఉంది. కొన్ని కార్యాలయాల్లో 1000 చ.అడుగుల కంటే తక్కువగా నిర్మిత స్థలం ఉన్నా ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతో లీజుకు ఇస్తోంది. బ్యాంకులు, కార్యాలయాల నిర్వహణ, వ్యాపారాలకు వీటిని కేటాయిస్తామని స్పష్టం చేసింది.