ప్రపంచ మార్కెట్లన్నీ కరోనా భయాలతో కుదేలవుతున్న వేళ దేశీయ పరిణామాలతో భారత సూచీలు కోలుకున్నాయని జాతీయ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. నిన్న విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు మార్కెట్లకు ఊతమిచ్చాయని తెలిపారు.
"మార్కెట్లలో ప్రస్తుత పరిస్థితులకు అంతర్జాతీయ పరిణామాలే కారణం. చాలా దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. 20 శాతం మేర పడిపోయాయి. వాటికన్నా భారత్ పరిస్థితి అదుపులో ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే.. భారత ఆర్థిక వ్యవస్థ వేరే అంశాలపై ఆధారపడింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.58 శాతానికి తగ్గింది. మరో ముఖ్యమైన విషయం ఉత్పాదక వస్తువులకు సంబంధించి 10 శాతం పెరుగుదల నమోదైంది. ఇది పెట్టుబడుదారులకు శుభవార్త. ఉత్పత్తి పెరిగితేనే పెట్టుబడులు వస్తాయి."
- కృష్ణమూర్తి సుబ్రమణియన్, జాతీయ ఆర్థిక సలహాదారు
ఇవాళ ట్రేడింగ్లో ఒకానొక దశలో 3,500 పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్.. 4,400 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 826 పాయింట్ల లాభంతో 33,603 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కూడా 1,200 పాయింట్లు పుంజుకుంది. ప్రస్తుతం 242 పాయింట్లు పెరిగి 9,832 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.