కొన్నేళ్లుగా దిగాలుగా ఉన్న వాహన రంగానికి కరోనా రూపంలో మరిన్ని కష్టాలు వచ్చాయి. అయితే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండడం శుభసూచకం. దీనికి తోడు పండగ సీజను కూడా వచ్చింది. ఈ సమయంలో విక్రయాలు పెంచుకొని గిరాకీని అందిపుచ్చుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. కార్ల తయారీ సంస్థలు అధికారికంగా ధరలు తగ్గించనప్పటికీ.. ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే, కొన్ని కొత్త మోడళ్లు.. అధికంగా అమ్ముడయ్యే ప్రీమియం, యుటిలిటీ వాహనాలపై మాత్రం డిస్కౌంట్లు ఇవ్వడం లేదు.
మారుతీ సుజుకీ:
ఈ కంపెనీ కొన్ని మోడళ్లపై ఇప్పటికే రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ నగదు డిస్కౌంట్లు ఇస్తోంది. దీనికి అదనంగా ఈ నెల 31 వరకూ రూ.5,000 నుంచి రూ.12,000 వరకూ రిటైల్ బోనస్‌గా ప్రకటించింది. ఎస్‌యూవీ ఎస్-క్రాస్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలిపి దాదాపు రూ.45,000 వరకూ తగ్గింపును ప్రకటించింది. ఎస్-ప్రెసో, బ్రెజా లాంటివాటిపై దాదాపు రూ.55,000వరకూ రాయితీలు ఇస్తానంటోంది. ఆల్టోలాంటి చిన్న కారుపైనా రూ.50,000 వరకూ తగ్గింపును ప్రకటించింది.
హ్యుందాయ్:
హ్యుందాయ్ అయితే ఈ నెలలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.30,000 వరకు నగదు డిస్కౌంట్లను అదనంగా ఇస్తోంది. చిన్న, మిడ్ సైడ్ సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై ఈ కంపెనీ భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఇంకా శాంత్రో, గ్రాండ్ ఐ10, ఎలంట్రా, ఎలైట్ ఐ20లపై రూ.70,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది.
టాటా మోటార్స్:
టియాగో, టిగోర్‌లపై ఈ నెల రూ.10,000 వరకు నగదు డిస్కౌంట్లు పెంచింది. మొత్తంగా పలు ప్రయోజనాలన్నీ కలిపి రూ.40,000 వరకూ తగ్గింపును అందిస్తానని చెబుతోంది. ఎస్‌యూవీలైన ఆల్ట్రోజ్, నెక్సాన్‌లపై మాత్రం ఈ ఆఫర్ లేదు.
మహీంద్రా అండ్ మహీంద్రా:
అక్టోబరులో ఎటువంటి డిస్కౌంట్లు పెంచని కంపెనీ ఇది. అయితే ఎక్స్ఛేంజీ డిస్కౌంట్లను మాత్రం రూ.5,000 వరకు అదనంగా ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హోండా కార్స్:
అత్యధికంగా రూ.లక్ష వరకు డిస్కౌంట్లను అదనంగా ఇస్తోన్న కంపెనీ ఇది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2,50,000 వరకు తగ్గిస్తోంది.
రెనో:
తన ట్రైబర్‌పై రూ.30,000 వరకూ.. క్విడ్‌పై రూ.40,000వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. వచ్చే కొద్ది నెలల పాటు కూడా కంపెనీలు ఈ తరహా ఆఫర్లను కొనసాగించే అవకాశం లేకపోలేదు. ఈ సీజనులో విక్రయాలు అందుకోకపోతే భారీ స్థాయిలో నిల్వలు పేరుకుపోతాయి. అపుడు మరిన్ని డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆసక్తి పెరుగుతోంది..
లాక్‌డౌన్ తర్వాత వాహన విక్రయాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన ఉండేది. కానీ, కరోనా నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకే ఇష్టపడుతున్నారు. ఇది అమ్మకాలపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు చాలామంది కార్ల షోరూంలకు విచ్చేస్తున్నారు. పెద్ద బైకులు కొనాలని భావించే వారు.. ఇప్పుడు చిన్న కార్లపైన దృష్టి సారిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పోలిస్తే.. ఇప్పుడు విక్రయాలు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. కంపెనీలు కొన్ని మోడళ్లపై రాయితీలు ప్రకటించడం కూడా కలిసొస్తోంది. దసరా రోజున తీసుకునేందుకు ఇప్పటికే బుకింగ్‌లూ అధికంగానే ఉన్నాయి.
- పి.ఎస్.కిరణ్, బిజినెస్ హెడ్, ఆర్‌కేఎస్ మోటార్