జీఎస్టీ రిటర్నులపై వ్యాపారులకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు.. ఇక నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్నులు లేదా జీఎస్టీఆర్-3బీని దాఖలు చేస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ పరిధిలోకి వచ్చే వ్యాపారాలు ప్రస్తుతం 12 జీఎస్టీ రిటర్నులు సమర్పిస్తున్నాయి.
నెలవారీ చెల్లింపుతో త్రైమాసిక రిటర్నుల ఫైలింగ్(క్యూఆర్ఎంపీ) పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం వల్ల 94 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. మొత్తం జీఎస్టీలో 92 శాతం ఈ వ్యాపారాల నుంచే వస్తోందని చెప్పారు. మరోవైపు, ఈ పథకంలో భాగంగా చిన్నస్థాయి చెల్లింపుదారులు ఏడాదికి ఎనిమిది(నాలుగు జీఎస్టీఆర్-3బీ, నాలుగు జీఎస్టీఆర్-1) రిటర్నులు సమర్పిస్తే సరిపోతుందని చెప్పారు.
నకిలీ ఇన్వాయిస్లకు చెక్ పెట్టే విధంగా పథకంలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు అధికారులు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌలభ్యాన్ని రిపోర్ట్ చేసిన ఇన్వాయిస్లకే అందించనున్నట్లు తెలిపారు.
ఇన్వాయిస్లు మొదటి రెండు నెలల్లోనే
క్యూఆర్ఎంపీ పథకంలో ఇన్వాయిస్ ఫైలింగ్ ఫెసిలిటీ(ఐఎఫ్‌సీ) అనే ఐచ్ఛిక వెసులుబాటు ఉందని తెలిపారు. త్రైమాసిక రిటర్నులు సమర్పించాలని అనుకొనే చెల్లింపుదారులు.. సంబంధిత త్రైమాసిక మొదటి రెండు నెలల్లో ఇన్వాయిస్లను అప్లోడ్ చేయవచ్చని స్పష్టం చేశారు. ఒక నెలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని.. ఇన్వాయిస్లను స్వీకరించేవారి డిమాండ్‌ను బట్టి వాటిని అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. తొలి, రెండో నెలకు సంబంధించిన మిగిలిన ఇన్వాయిస్లు త్రైమాసిక జీఎస్టీఆర్-1 ద్వారా సమర్పించవచ్చని చెప్పారు.