కేంద్ర బడ్జెట్‌పై వాహన పరిశ్రమ వర్గాలు భిన్నంగా స్పందించాయి. పలువురు ఈ బడ్జెట్‌ను స్వాగతించగా... మరికొందరు పద్దుపై నిరాశ వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ అయిన ఫాడా(ఫెడరేషన్ ఆఫ్ ఆటో డీలర్స్ అసోసియేషన్) తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలన్నీ 3-4 నెలల్లో అమలు చేస్తే డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, చిన్న వాణిజ్య వాహనాలకు డిమాండ్ ఏర్పడుతుందని తెలిపింది. కానీ బడ్జెట్లో వాహన రంగానికి ప్రత్యక్ష ప్రయోజనాలేవీ లేవని అభిప్రాయపడింది.
"ఇది సమగ్ర బడ్జెట్ అయినప్పటికీ... సత్వరమే డిమాండ్‌ను పునరుద్ధరించే అంశాలు లేవు. వాహన పరిశ్రమకు ప్రత్యక్ష ప్రయోజనాలు ఏవీ లేకపోవడం నిరాశాజనకం. ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య లభ్యత కోసం మద్దతు ఇస్తున్నందున... వాహన రంగానికి ఉపయోగపడుతుంది."
-ఆశిశ్ హర్షరాజ్ కాలే, ఫాడా అధ్యక్షుడు
బడ్జెట్‌పై సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా పెదవి విరిచారు. బడ్జెట్ ప్రసంగంలో ఆశించినదేమీ లేదని అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుత మందగమనం నేపథ్యంలో డిమాండ్‌ను పునరుద్ధరించడానికి బడ్జెట్లో ప్రత్యక్ష ప్రయోజనాలు ఉంటాయని భారత వాహన పరిశ్రమ ఆశించింది. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఆశించిందేమీ లేదు."
-రాజన్ వాధేరా, సియామ్ అధ్యక్షుడు
డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు ప్రోత్సాహక-ఆధారిత వాహన స్క్రాపేజ్ పథకం, డీజిల్ బస్సుల కోసం నిధుల కేటాయింపు, లిథియం అయాన్ బ్యాటరీలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు వంటి పలు సూచనల్ని సియామ్ చేసిందని చెప్పారు రాజన్. అయితే వీటన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.
ఏసీఎంఏ సంతృప్తి
మరోవైపు ఆటో కాంపోనెంట్ బాడీ ఏసీఎంఏ మాత్రం బడ్జెట్లో చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, తయారీ, మౌలిక పరిశ్రమలపై బడ్జెట్ దృష్టిసారించిందని పేర్కొంది.
"రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సాంకేతికత అభివృద్ధి, వాహన విడిభాగాల తయారీ, ఎగుమతులు వంటి మధ్య స్థాయి కంపెనీలకు హ్యాండ్ హోల్డింగ్ పథకం ద్వారా రూ.1000 కోట్లు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం."
-దీపక్ జైన్, ఏఎంసీఏ అధ్యక్షుడు
ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ పెంపును సమర్థించారు టాటా మోటార్స్(ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్) అధ్యక్షుడు శైలేష్ చంద్ర.
"ఉపాధి కల్పన కోసం ప్రభుత్వానికి మేక్ ఇన్ ఇండియా తొలి ప్రాధాన్యంగా ఉంది. దీని ద్వారా వాస్తవ పరికరాల తయారీదారులు విద్యుదీకరణ వైపు మొగ్గు చూపడానికి ఉపయోగపడుతుంది."
-శైలేష్ చంద్ర, టాటా మోటార్స్ అధ్యక్షుడు
ప్రస్తుత పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పులు రేపటి ప్రభావానికి సరిపోవని, కానీ దీర్ఘ కాలంలో ఆర్థిక వ్యవస్థకు బలమైన ప్రేరణ ఇస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడులు, పన్ను సంస్కరణల ద్వారా మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరుగుతుందని నిస్సాన్ మోటార్స్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ అన్నారు.
"తాజా బడ్జెట్ మౌలికం, గ్రామీణ ఆర్థికానికి ఊతమిస్తుంది. తద్వారా వాహన రంగానికి తోడ్పాటు అందిస్తుంది."
-రాకేష్ శ్రీవాస్తవ, నిస్సాన్ మోటార్స్ ఇండియా ఎండీ