Budget In Pharmacy: కొవిడ్ మహమ్మారి మన దేశ వైద్యారోగ్య వ్యవస్థ పటిష్ఠతకు పరీక్ష పెట్టింది. లోపాల్ని, లొసుగుల్ని ఎత్తిచూపి పాలకులు, పరిశ్రమ వర్గాలను అప్రమత్తం చేసింది. ఇంకా చేయాల్సింది చాలా ఉందని గుర్తుచేసింది. దీంతో గత బడ్జెట్‌లో ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యాక్సిన్లు, ఔషధాలపై రాయితీలు కల్పించింది. తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయితే, కరోనా సృష్టించిన అస్థిర పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఈసారి బడ్జెట్‌లోనూ ఔషధ , వైద్యపరికరాల తయారీ పరిశ్రమలు మరిన్ని ప్రోత్సాహకాలు కోరుకుంటున్నాయి.
పరిశోధనలతోనే పరిశ్రమకు భరోసా..
budget india 2022: ఔషధ రంగంలో నిరంతరం పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. అప్పుడే కొత్తగా పుట్టుకొస్తున్న జబ్బులను సమర్థంగా ఎదుర్కోగలం. కొవిడ్ పుణ్యమా అని దీని ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించగలిగింది. ప్రత్యేకంగా పరిశోధన-అభివృద్ధి కోసం ఓ ఫండ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిపై ఇప్పటికే పరిశ్రమ వర్గాలతో చర్చలు జరిపింది. ఈ బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. అలాగే గతంలో ఫార్మా ఆర్‌అండ్‌డీ పరిశ్రమలకు ఇచ్చిన పన్ను ప్రయోజనాలను తిరిగి పునరుద్ధరించాలని నిపుణులు కోరుతున్నారు.
పెట్టుబడులు పెరగాలి..
Union Budget 2022 Expectations in Pharma: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అదే తరహాలో ఫార్మాను సైతం ముందుకు తీసుకెళ్లాలని పరిశ్రమ పెద్దలు కోరుతున్నారు. పీఎల్‌ఐ వంటి పథకాలను ఫార్మా రంగానికీ విస్తరించడం ద్వారా కీలక ఏపీఐలు, కాంప్లెక్స్ పదార్థాలు, డ్రగ్ ఇంటర్మీడియేట్స్, బయోఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీకి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ప్రపంచ స్థాయి ఫార్మా కంపెనీలతో ఒప్పందాలను ప్రోత్సహించడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వం బడ్జెట్‌లో విధానపరమైన నిర్ణయాలు, కేటాయింపులు ప్రకటించాలని ఫార్మా ఇండస్ట్రీ కోరుతోంది.
ప్రోత్సాహకాల కొనసాగింపు..
కొవిడ్ నేపథ్యంలో ఫార్మా రంగాలకు ప్రభుత్వం అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. వాటన్నింటినీ మరికొంత కాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఫార్మా నిపుణులు కోరుతున్నారు. కంపెనీల తయారీ సామర్థ్య విస్తరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం 115 బీఏబీ నిబంధన కింద పన్నులపై 15 శాతం రాయితీ కల్పించింది. ఫార్మా స్టార్టప్‌లలో పెట్టే పెట్టుబడుల నుంచి వచ్చే మూలధన రాబడిపై పన్నుకు మినహాయింపునిచ్చింది. వీటన్నింటినీ మరికొంత కాలం కొనసాగించాలని ప్రభుత్వానికి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ధరల స్థిరీకరణ.. పన్ను మినహాయింపులు..
Taxes on Pharma Sector: ఔషధాల ప్రమోషన్ కోసం పెద్ద ఎత్తున శాంపిళ్లను వైద్యులకు అందజేయాల్సి ఉంటుంది. వాటిపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని పరిశ్రమ కోరుతోంది. అలాగే క్లినికల్ ట్రయల్స్, పరిశోధన కార్యక్రమాలకు అయ్యే ఖర్చుకు సంబంధించిన వ్యయంపైనా పన్ను మినహాయింపులు ఉండాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఇక మహమ్మారి ఆందోళన నేపథ్యంలో కొన్ని ఔషధాలపై ధరల్ని ప్రభుత్వం కొంతమేర తగ్గించింది. వాటికి దీర్ఘకాంలోనూ గిరాకీ కొనసాగే అవకాశం ఉండడంతో వాటి ధరలను స్థిరీకరించాలని కోరుతున్నాయి. అదే బాటలో వైద్య పరికరాలపైనా జీఎస్టీ మినహాయింపు, ధర స్థిరీకరణ వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
ఆధునిక వైద్యానికి మౌలికవసతులు..
దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, వైద్యారోగ్య సంరక్షణ వ్యవస్థలకు కావాల్సిన మౌలిక వసతుల్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో ప్రాచుర్యం పొందిన టెలీమెడిసిన్, హోం అండ్ సీనియర్ కేర్ వంటి ఆధునిక వైద్య పద్ధతులకు కావాల్సిన మౌలికవసతుల్ని బలోపేతం చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. తద్వారా ఆసుపత్రులపై భారం తగ్గించి రోగులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. అలాగే ఈ రంగంలో నిపుణుల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు శిక్షణాకార్యక్రమాలను ప్రోత్సహించాలి.
ఎగుమతులకు ప్రోత్సాహకాలు..
Export Incentives in India: వ్యాక్సిన్లు, ఔషధాల తయారీ పరిశ్రమలు మరింత వృద్ధిలోకి రావాలంటే.. వాటి ఉత్పత్తుల్ని ఇతర దేశాలకూ ఎగుమతి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎగుమతులపై ఉన్న ఆంక్షల్ని పరిమితం చేయడంతో పాటు కొన్ని రకాల ప్రోత్సాహకాలు, మినహాయింపులూ ప్రకటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచ ఫార్మసీగా ఉన్న భారత్ మరింత వృద్ధి సాధిస్తుంది.
కొవిడ్ కష్టకాలంలో ఔషధాలు, వ్యాక్సిన్ల రూపంలో యావత్తు దేశానికి ఫార్మా, వైద్యపరికరాల పరిశ్రమలు అండగా నిలిచాయి. ఎగుమతులతో ప్రపంచ దేశాలనూ ఆదుకున్నాయి. వైద్యారోగ్య రంగంతో భుజం కలిపి దేశ ప్రజల సంరక్షణలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కేటాయింపుల్ని పెంచి ఈ రంగాన్ని మరింత వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచ ఫార్మసీగా పేరుగాంచిన భారత్ కృషికి ఫలితం దక్కుతుంది!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: Union Budget 2022 : బడ్జెట్ కత్తిమీద సామే.. నిర్మలమ్మ ముందున్న సవాళ్లివే.!
స్విస్ కంపెనీతో వివాద పరిష్కారానికి స్పైస్‌జెట్‌కు 3వారాల గడువు