ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం... అంతర్జాతీయంగా పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కొనే వ్యూహాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు గ్రూపులుగా విలీనం చేయనున్నట్లు ఆగస్టు 30న ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫలితంగా దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనుంది.
విలీనంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపర్చేందుకు కీలక చర్యలు ప్రకటించారు నిర్మల. ఎన్డీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకున్న అతిపెద్ద సంస్కరణల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. భారత బ్యాంకింగ్ స్థితిగతులనే మార్చగల సత్తా ఈ నిర్ణయానికి ఉంది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత కఠిన ప్రయాణాన్ని సాగించింది. కఠిన నిబంధనలు, చట్టాలతో ఇబ్బంది పడింది. గతంలో నిరర్ధక ఆస్తులతో భారం పడినప్పటికీ 1990 ప్రారంభంలో వచ్చిన సరళీకరణతో ఊపిరి పీల్చుకుంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే మెరుగైన బ్యాంకింగ్ వ్యవస్థగా ఏర్పడింది.
సంక్షోభంలోనూ స్థిరత్వం..
గతంలో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం వచ్చిన సమయంలో అగ్ర దేశాల దిగ్గజ బ్యాంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ బ్యాంకులకు అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. భారతీయ బ్యాంకులు మాత్రం భిన్నం. ఇతర దేశాల బ్యాంకులతో పోల్చితే సంక్షోభాన్ని మెరుగ్గా తట్టుకుని నిలబడ్డాయి మన బ్యాంకులు.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఇంతటి సామర్థ్యం అంత సులువుగా రాలేదు. సంక్షోభాలను ఎదుర్కొనే ఆలోచనతో కేంద్ర బ్యాంక్ అధికారులు పకడ్బందీగా అమలుచేస్తూ వచ్చిన విధానాలే ఇందుకు కారణం. ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థకు ఎప్పటికప్పుడు లాభాల పంట పండింది. ఆస్తి, క్రెడిట్ విస్తరణ, మూలధన సమృద్ధి వంటి అంశాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది.
ప్రభుత్వ వైఖరి మారింది!
బ్యాంకింగ్ విషయంలో ఇటీవల ప్రభుత్వ వైఖరి మారినట్లు కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, మెరుగైన సామర్థ్యాలతో బలమైన ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏర్పాటు చేయడమే కేంద్ర సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.
భవిష్యత్ తరాలకు తగిన బ్యాంకుల నిర్మాణమే ఈ విధానానికి మూల కారణమైనా... గత అనుభవాలను విస్మరించలేం. దాదాపు పదేళ్ల క్రితం పాశ్చాత్య దేశాల్లోని లేమాన్ బ్రదర్స్, బియర్ స్టియర్న్స్ , అమెరికా ఇంటర్నేషనల్ గ్రూప్ (ఏఐజీ) వంటి దిగ్గజ బ్యాంకులు విఫలమయ్యాయి. ఆ వైఫల్యం బ్యాంకింగ్ వ్యవస్థకే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక మూలాలే కదిలిపోయాయి. అలాంటి తప్పులు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం కీలకం.
పరాజయాల నుంచి పాఠాలు
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలంటే ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు అవసరమే. అయితే... బ్యాంకు పెద్దదైతే దాని వైఫల్యం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగానే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆధునిక బ్యాంకులు కేవలం జమ, విత్‌డ్రాకు మాత్రమే పరిమితం కావడంలేదు. అవి దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలో ముఖ్యభాగంగా మారాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి, ఉత్పత్తి, సంపద సృష్టిపైనే ప్రభావం చూపే స్థితికి ఎదిగాయి. అందుకే... బ్యాంకు వైఫల్యాలను అరికట్టేందుకు పటిష్ఠ విధివిధానాలు రూపొందించుకోవడం అవసరం.
2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం బ్యాంకుల వైఫల్యానికి ఓ ప్రధాన కారణముంది. తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము ఆర్జించే లక్ష్యంతో బ్యాంకర్లు రిస్కులు చేయడం కొంపముంచింది. ప్రమాదకర పెట్టుబడులకు ప్రజాధనాన్ని వెచ్చించడం... బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది.
బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం
అతిపెద్ద బ్యాంకుల నిర్మాణం దిశగా భారత్ అడుగులేస్తున్న తరుణంలో పూర్వ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి తప్పులను మళ్లీ చేయకుండా చూడాలి. వాస్తవానికి, దేశ స్థూల ఆర్థిక పరిస్థితిని బట్టి అలాంటి వైఫల్యాలను భారత్ భరించలేదు. బ్యాంకుల విలీన సమయంలో భౌగోళిక, సాంకేతిక, మానవ వనరుల సినర్జీలను ఉపయోగించి కార్యాచరణ సామర్థ్యాన్ని సాధించాల్సిన అవసరం ఉంది.
బ్యాంకుల్లో పాలనా సంస్కరణలు సానుకూలంగా ఉన్నప్పటికీ, బ్యాంకు పాలకుల్లో మరింత వృత్తి నైపుణ్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుపై రాజకీయ ఒత్తిళ్లను తగ్గించాలి.
బ్యాంకింగ్ రంగానికి, ఆర్థిక రంగ అభివృద్ధికి మధ్య ఉన్న బలమైన సంబంధం దృష్ట్యా.. సమ్మిళిత అభివృద్ధికి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉండటం అవసరం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారతదేశ బ్యాంకులు చెరగని ముద్ర వేయడానికి సహాయపడుతుంది.
(రచయిత- మహేంద్ర బాబు కురువ, సహాయ ఆచార్యులు, హెచ్ఎన్బీ గర్వాల్ విశ్వవిద్యాలయం-ఉత్తరాఖండ్)