వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనం భారత మార్కెట్లోకి వచ్చేసింది. మంగళవారం చేతక్ ద్విచక్రవాహనాన్ని కంపెనీ నిర్వాహకులు విడుదల చేశారు. అర్బన్, ప్రీమియం పేరిట రెండు వేరియంట్లలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. చేతక్ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ.1లక్ష (ఎక్స్ షోరూం పుణె, బెంగళూరు)గా నిర్ణయించారు. అర్బన్ వేరియంట్ ధర రూ.లక్ష కాగా.. ప్రీమియం వేరియంట్ ధర రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు. రేపటి నుంచి చేతక్ బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నుంచి వాహనాలను డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం పుణె, బెంగళూరులో మాత్రమే దీన్ని విడుదల చేశారు.
రెండు దశాబ్దాల తర్వాత
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బజాజ్ చేతక్ ద్విచక్రవాహనాలను మళ్లీ విక్రయిస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో దాదాపు 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని బ్యాటరీ ఫుల్‌గా రీఛార్జి చేసేందుకు 5 గంటల సమయం పడుతుంది. భారత్‌లో ప్లాస్టిక్ బాడీకి బదులు మెటల్ బాడీతో తయారైన తొలి ద్విచక్రవాహనం ఇదే కావడం విశేషం. మహారాష్ట్రలోని చకన్ కర్మాగారంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీని చేపట్టినట్లు బజాజ్ ఎండీ రాజీవ్ ఈ సందర్భంగా వెల్లడించారు. 2019 సెప్టెంబరు 25 నుంచి చేతక్ తయారీని నిర్వహించినట్లు తెలిపారు. దీనికి మూడు సంవత్సరాల వారెంటీ, మూడు ఉచిత సర్వీసులను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉల్లి ఘాటుతో 8 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం