కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా అది మిగిల్చిన ఆర్థిక నష్ట భయాలు ఇంకా వీడలేదు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య బీమా పాలసీలు(Insurance Sector In India) ఎంతో కీలకంగా మారాయి. వ్యక్తిగత వాహనాలకు గిరాకీ పెరగడం వల్ల.. ఆ విభాగంలోనూ వృద్ధి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీమా రంగ(Insurance Sector In India) పరిస్థితులపై బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్(Bajaj Allianz General Insurance) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తపన్ సింఘేల్.. పలు కీలక విషయాలు 'ఈనాడు'తో పంచుకున్నారు.
సాధారణ బీమా రంగంలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి.?
కొవిడ్-19 తరవాత ఆరోగ్య బీమాకు గిరాకీ పెరిగింది. గత ఏడాది వాహన, ప్రయాణ బీమా విభాగాలు అంత ఆసక్తికరంగా లేవు. ఇప్పుడు ఈ విభాగాల్లోనూ వృద్ధి కనిపిస్తోంది. డిజిటల్ వైపు అడుగులు వేయడానికి బీమా సంస్థలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ కరోనా ఫలితంగా ఆన్‌లైన్‌లో పాలసీలు తీసుకునే వారి సంఖ్య దాదాపు 40 శాతానికి పైగా పెరిగింది. మా వరకు చూస్తే.. ఏప్రిల్ 2020 నుంచి జూన్ 2021 వరకు దాదాపు 2.5 కోట్ల పాలసీలను డిజిటల్ రూపంలోనే అందించాం. 5 లక్షలకు పైగా పాలసీల(Insurance Sector In India) క్లెయింలను డిజిటల్‌లో పరిష్కరించాం.
కొవిడ్-19 ఉద్ధృతి తగ్గింది కదా.. ఇప్పటికీ ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు అధికంగా ఉందా.?
మన మెదడు భయాన్ని తట్టుకునేందుకు సిద్ధంగా ఉండదని సైకాలజిస్టులు చెబుతుంటారు. కొవిడ్ భయం మన ఇంటి గడప వరకూ వచ్చింది. ఇందువల్ల, లేదా పెరిగిన వైద్య ఖర్చులు దృష్టిలో పెట్టుకుని కావచ్చు.. ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ప్రభుత్వం కూడా ఆరోగ్య బీమా పాలసీలపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని(Gst On Insurance Premium) తగ్గించాలి.
భవిష్యత్‌లో వచ్చే మహమ్మారులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు పరిశ్రమ ఎలా సన్నద్ధం అవుతోంది.?
గతంలో 5 ఏళ్లలో ఒకటి రెండుసార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చేవి. ఇప్పుడు ఏడాదికి 5 కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బీమా సంస్థలు తమ పాలసీల్లో మార్పులు చేస్తున్నాయి. బీమా చేసిన వస్తువుల నష్టం, ఆర్థిక నష్టం, ఆస్తుల విషయంలో ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్‌ను తీసుకురావాలి. ఆస్తి పన్నుతో పాటే... దానికి బీమా ప్రీమియాన్ని వసూలు చేసే విధానాన్ని తీసుకురావాలి. బీమా చేసిన ఆస్తికి నష్టం వాటిల్లితే.. బీమా సంస్థల నుంచి క్లెయిం మొత్తం నేరుగా పాలసీదారుడి జన్‌ధన్ ఖాతాలో జమ అయ్యే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి మహమ్మారి నిధి లాంటిది ఏర్పాటు చేయాలి. లాక్‌డౌన్‌లు విధించినప్పుడు ఈ నిధి ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడాలి. మహమ్మారి అనుబంధ పాలసీలు కార్పొరేట్ పాలసీలకు తప్పనిసరిగా జోడించుకునే ఏర్పాటు ఉండాలి. అప్పుడు లాక్‌డౌన్‌లు వచ్చినప్పుడు జీతాల్లో కోత విధించకుండా చూడొచ్చు. వ్యాపారంలో ఏర్పడే నష్టాలనూ తట్టుకునే వీలుంటుంది. వ్యక్తులు కూడా ఇంటి బీమా పాలసీతోపాటు ఈ తరహా యాడ్‌ఆన్ పాలసీలను తీసుకోవాలి.
వాహన బీమా రంగం పరిస్థితి ఎలా ఉంది.?
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్విచక్ర వాహనాల(Vehicle Insurance) బీమా పాలసీల్లో వృద్ధి కనిపించింది. ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు మారుతున్న వారి సంఖ్య పెరుగుతున్నందున, భవిష్యత్‌లో కార్ల బీమాలో వృద్ధి కనిపిస్తుందని భావిస్తున్నాం. ఈ పాలసీల్లో కొత్త మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఈ ఆర్థిక సంవత్సరంలో మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి.?
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బజాజ్ అలియంజ్ ఆదాయం రూ.2,491 కోట్లుగా నమోదయ్యింది. ఆగస్టు 2021 నాటికి స్థూల ప్రీమియం వసూళ్లు రూ.6,468.37 కోట్ల వరకూ ఉన్నాయి. ఈ వృద్ధిని కొనసాగిస్తాం. ఆర్థిక వృద్ధి ఉన్నప్పుడే బీమా రంగం వృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి, బీమా పాలసీలు గ్రామాలకు చేరాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, మా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం.
ఇవీ చూడండి: