ప్రపంచవ్యాప్తంగా.. స్మార్ట్‌ఫోన్ కోసం అధిక సమయాన్ని వెచ్చిస్తున్న వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నట్టు ప్రముఖ సంస్థ నోకియా చేసిన సర్వేలో తేలింది. భారత్‌లో ఒక వ్యక్తి.. రోజులో సగటున దాదాపు 5 గంటల సమయాన్ని మొబైల్ ఫోన్‌కే కేటాయిస్తున్నాడని సర్వే స్పష్టం చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో(2025నాటికి) ఈ సంఖ్య మరో నాలుగు రెట్లకు పెరుగుతుందని నోకియా ఓ నివేదికలో వెల్లడించింది.
ఇందులో భాగంగా.. 55శాతం మంది యూట్యూబ్, సోషల్ మీడియా, ఓటీటీ వంటి వాటికి సమయాన్ని వెచ్చిస్తుండగా.. మిగిలిన 45 శాతం మంది ఫిన్‌టెక్, ఇ-వాణిజ్యం, ఇతర బ్రౌజింగ్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు నోకియా పేర్కొంది.
నోకియా విడుదల చేసిన వార్షిక నివేదిక 'మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్(ఎంబిట్) 2021' ప్రకారం.. బ్రాడ్‌బ్యాండ్ వాడకంలో రెండో స్థానంలో నిలిచింది భారత్. ఈ విషయంలో ఫిన్లాండ్ తొలి స్థానంలో ఉంది. గత ఐదేళ్ల కాలంలో భారత్‌లో డేటా ట్రాఫిక్ 63రెట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం. 2015 డిసెంబర్లో 164 పెటాబైట్ల డేటాను వినియోగించగా.. గతేడాది డిసెంబర్ నాటికి ఇది 10వేల పెటాబైట్లకు చేరింది.
అయితే.. ఇంటి నుంచే పనిచేయడం(వర్క్ ఫ్రమ్ హోమ్) వల్ల దేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు మరింత డిమాండ్ పెరిగినట్టు సమాచారం. ఆన్లైన్ క్లాసుల ప్రభావం వల్ల.. విద్యాపరమైన అంశాల కోసం సమయం కేటాయించే వారి సంఖ్య 2020 ఫిబ్రవరి నుంచి రెండు నెలల కాలంలో.. 30శాతం నుంచి 265 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది.
ఇక 3జీ, 4జీ నెట్‌వర్క్‌లలో కలిపి నెలకు సగటు డేటా వినియోగం గత ఐదేళ్లలో 76శాతం సీఏజీఆర్(కాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్) 13.5జీబీ(గిగాబైట్)కి పెరిగింది. 4జీ నెట్వర్క్ల్లోనే నెలకు సగటున 13.7 జీబీ ఉపయోగిస్తున్నట్టు సర్వేలో తేలింది.
ఇదీ చదవండి: ఆ రంగాల్లో పెరిగిన నియామకాలు.. కానీ!