జూన్ నెలలో వాహన విక్రయాలు మే నెలతో పోలిస్తే గణనీయంగా మెరుగు పడ్డాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా, నిస్సాన్ మోటార్, హోండా, టయోటా, ఎంజీ మోటార్‌ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు.. అన్ని విభాగాల్లోనూ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు ఆరంభం కావడం, వినియోగదారు సెంటిమెంట్ మెరుగుపడటం వాహన కంపెనీలకు కలిసొచ్చింది.
మారుతీ మేలో 46,555 వాహనాలను విక్రయించగా, జూన్‌లో 217 శాతం వృద్ధితో 1,47,368 వాహనాలను విక్రయించింది. కొవిడ్-19 ఆంక్షల్ని చాలా రాష్ట్రాల్లో సడలించడంతో విక్రయ కేంద్రాలకు అధిక సంఖ్యలో వాహనాలను చేర్చగలిగినట్లు మారుతీ తెలిపింది. ఆయా సంస్థలు మే, జూన్ నెలల్లో విక్రయించిన వాహన గణాంకాలు పట్టికలో..
ద్విచక్ర వాహన విక్రయాల్లో 12-14% వృద్ధి: ఇక్రా
ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ద్విచక్ర వాహన విక్రయాలు 12-14 శాతం మేర వృద్ధి చెందే అవకాశాలున్నాయని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నుంచి కోలుకోవడానికి సమయం పట్టినా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విక్రయాలు పెరిగేందుకు మద్దతు ఇస్తుందని పేర్కొంది. రాబోయే పండుగల సీజన్‌లో విక్రయాలకు గిరాకీ పెరుగుతుందని వెల్లడించింది.
ఇదీ చూడండి: 'కరోనా ప్రభావం ఉన్నా.. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది'