ATM Withdrawal Charges: ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన అనంతరం వినియోగదార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకుంటే అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. పరిమితికి మించిన నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీలపై 2022 జనవరి నుంచి ఛార్జీలు పెంచుకోవచ్చని గత జూన్‌లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు అనుమతి మంజూరు చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీపై రూ.21+జీఎస్‌టీ వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇప్పటివరకు ఈ ఛార్జీ రూ.20+జీఎస్‌టీగా ఉంది. తమ ఖాతాదారులు బ్యాంక్ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించుకున్నా ఇది వర్తిస్తుందని తెలిపింది.
వినియోగదార్లు తమ ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అదనంగా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మెట్రో కేంద్రాల్లో 3, మెట్రోయేతర కేంద్రాల్లో 5 ఉచిత లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు ఉంది.
ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంచుకునేందుకూ ఆర్‌బీఐ ఆమోదించిన నేపథ్యంలో, ఆర్థిక లావాదేవీలపై రుసుమును రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు గత ఆగస్టు నుంచే బ్యాంకులు అమల్లోకి తీసుకొచ్చాయి.
ఇదీ చూడండి: శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? ఏడాదికి రూ.లక్షన్నర కట్టాల్సిందే!