ఆటో ఎక్స్పో 2020.. ఆసియాలోనే అతిపెద్ద వాహన ప్రదర్శన.. కాన్సెప్ట్ కార్లు.. మెరుగులద్దిన బైక్‌లు.. అత్యాధునిక టెక్నాలజీ ట్రక్‌లు.. కనువిందు చేసేవెన్నో. ఎన్ని ఉన్నా అందులో టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలిచేవి మాత్రం కొన్నే. స్టైల్‌తో, నమ్మశక్యంకాని ఫీచర్లతో భవిష్యత్తులో రోడ్డెక్కబోతున్న కొన్ని వాహనాల హొయలు చూద్దాం. వాటితోపాటు మూలపడ్డ వాహనాల్ని మేటి కళాకృతులుగా తీర్చిదిద్దిన కార్టిస్టుల ప్రతిభనూ చర్చిద్దాం.
కార్టిస్టుల ప్రత్యేకత
ఈమధ్య కాలంలో పెద్దపెద్ద వాహన ప్రదర్శనలు ఎక్కడ జరిగినా అందరినీ ఆకట్టుకుంటున్నారు కార్టిస్టులు. కాలం చెల్లిన వాహనాలపైన చిత్రాలు చెక్కే కళాకారులే ఈ కార్టిస్టులు. రాజస్థాన్‌లోని జైపుర్ కేంద్రంగా ఉండే ఈ కార్టిస్టులు దేశమంతా విస్తరించారు. 2020 ఆటో-షో కోసమే కొత్తకొత్త కళాకృతుల్ని తీర్చిదిద్దారు. బొమ్మలేయడమే కాదు.. టైర్లు, రిమ్‌లు, ఇంజిన్.. ఇలా అన్ని విడిభాగాలతోనూ భిన్నమైన ఆకృతుల్ని తీర్చిదిద్దే నైపుణ్యం వీళ్ల సొంతం. కొందరైతే పాడైపోయిన పార్ట్స్‌తో సోఫా, టేబుల్‌లాంటి ఫర్నిచర్‌నీ తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. పనికిరాని వస్తువంటూ ఏదీ లేదని చెప్పడం, వాహనాల్ని పర్యావరణహితంగా మార్చడమే మా ఉద్దేశమంటారు కార్టిస్టులు.
వేగం వేగం..
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నాలుగు డోర్ల కూపె మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63ఎస్. గంటకి 315 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్తుంది. 6 సిలిండర్ వీ8 ఇంజిన్‌తో పని చేస్తుంది. అత్యంత శక్తిమంతమైన 639 హార్స్‌పవర్ దీని సొంతం. కొనాలంటే రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. పన్నులు అదనం.
మేళవింపు ఫీచర్లతో..
భారతీయ నెంబర్‌వన్ కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా తయారు చేస్తున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కారు మారుతీ ఫ్యూచరో-ఈ. స్పోర్ట్ యుటిలిటీ, కూపె రకాల్లోని మేటి ఫీచర్లను మేళవించి ఈ కొత్తరకం సెగ్మెంట్ తీసుకొస్తున్నారు. డిజైన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. లోపల గుండ్రంగా తిరిగే ట్రావెల్ సీట్లు, రాజీపడని ఇంటీరియర్ సౌకర్యాలు.. విలాసానికి చిరునామాగా ఉండబోతోందీ కారు.
ఇటలీ బండి.. ఇక్కడే
స్కూటరు ప్రేమికులకు ప్రీమియం కానుక ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160. విండ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, యూఎస్‌బీ ఛార్జింగ్, ఏబీఎస్, డ్యుయెల్ టోన్ ఎక్స్‌టీరియర్.. ఇలా ఫీచర్ల జాబితా పెద్దదే. నాలుగునెలల్లో అందుబాటులోకి వస్తోంది.
కాలుష్యానికి చెక్
రెనాల్ట్ కంపెనీ ‘జీరో ఉద్గార కాలుష్య వాహన శ్రేణి’ లక్ష్యానికి మొదటి అడుగు రెనాల్ట్ సింబియోజ్. రియర్ వీల్ కాన్ఫిగరేషన్, రెండు విద్యుత్తు మోటార్లతో పని చేస్తుంది. కావాల్సినప్పుడు ముడుచుకుపోయే డాష్‌బోర్డు, ఎటుకావాలంటే అటువైపు తిరిగే సీట్లున్నాయి. భవిష్యత్తులో దీన్ని డ్రైవరులేని కారుగా మార్చే ఆలోచనలో ఉంది రెనాల్ట్.
చూపుతోనే పరుగు
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటీ వాహనం గ్రేట్ వాల్ హవాల్ విజన్ 2025. ఫేస్ రికగ్నిషన్, 5జీతో పని చేస్తుంది. దానంతటదే పార్క్ చేసుకుంటుంది. డ్రైవరు చేసే పనులలో ఇదే తొంభైశాతం చేసేస్తుంది.ఈ స్మార్ట్, ఇంటలిజెంట్ కారు స్టీరింగ్ పట్టుకోవాలంటే ఐదారేళ్లైనా ఆగాలి.
ఐదు సెకన్లలో వంద
సీతాకోకచిలుక స్ఫూర్తితో, ఓపెన్ టాప్‌తో రూపొందించిన కాన్సెప్ట్ విద్యుత్తు కారు మహీంద్రా ఫన్‌స్టర్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్ఛు ఐదు సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఎక్స్‌యూవీ 500 డిజైన్‌ని పోలి ఉంటుంది.
నేలపైనా, నీటిలోనూ
డూన్ బగ్గీ కాన్సెప్ట్‌తో తయారైన రెండు సీట్ల బండి హ్యుందాయ్ కైట్. దీన్నే నీటిపై పయనించే సింగిల్ సీటు బోటుగానూ మార్చుకోవచ్ఛు కొన్నాళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే ఈ సరికొత్త వాహనాన్ని ఇటలీలోని ప్రతిష్ఠాత్మక యూరోపియా డి డిజైన్ (ఐఈడీ)లో తీర్చిదిద్దుతున్నారు.
వివరాలివి..
షో సమయం: ఫిబ్రవరి 7-12
పాల్గొనేవి: ప్రముఖ కార్ల, మోటార్ సైకిళ్ల తయారీ సంస్థలు, విడిభాగాల తయారీ సంస్థలు, విద్యుత్తు వాహనాల స్టార్టప్ కంపెనీలు.
ప్రదర్శన: వందకు పైగా కార్లు, పదుల సంఖ్యలో బైక్‌లు, ఇతర వాహనాలు.
వేదిక: దిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా ఎక్స్పో మార్ట్.
నిర్వహకులు: సొసైట్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్షరర్స్ (సియామ్), ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్షరర్స్ అసోసియోషన్(ఏసీఎంఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( సీఐఐ)లు.
ప్రవేశం: బుక్ మై షోలో టికెట్లు లభ్యం.