ఆర్టికల్ 370 అంటే? అయోధ్య కేసు ఏంటీ? ఎన్ఆర్సీ అంటే ఏంటి? ఇవీ భారతీయులు ఈ ఏడాది గూగుల్‌ను అడిగిన టాప్-10 'వాట్ ఈజ్' ప్రశ్నల్లో కొన్ని. ఇటీవల విడుదలైన గూగుల్ 2019 సెర్చ్ రిపోర్ట్ ఈ విషయాలను వెల్లడించింది.
ఆర్టికల్ 370, సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్, బ్లాక్ హోల్, హౌడీ మోదీ వేడుకకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి భారత్‌లోని నెటిజన్లు ఎంతో ఆసక్తి కనబరిచినట్టు రిపోర్టు స్పష్టం చేసింది.
ఈ ఏడాది సెర్చ్ చేసిన అంశాలను గతేడాది ఉన్న డేటాతో పోల్చి ఈ రిపోర్టును రూపొందించినట్టు గూగుల్ స్పష్టం చేసింది.
హౌ టు...?
హౌ టు(ఎలా)? అన్న భారతీయుల సెర్చ్‌ను కూడా గూగుల్ వెల్లడించింది. ఈ జాబితాలో సార్వత్రిక ఎన్నికల అంశం టాప్‌లో నిలిచింది. ఓటు ఎలా వెయ్యాలి? ఓటర్ జాబితాను ఎలా చూడాలి? వంటి ప్రశ్నలను భారతీయులు అధికంగా అన్వేషించారు.
భారతీయుల సెర్చ్ ట్రెండ్‌లో లోక్‌సభ ఎన్నికలు రెండో స్థానంలో నిలిచాయి. మొదటి స్థానం క్రికెట్ ప్రపంచకప్‌దే.
చంద్రయాన్-2, ఆర్టికల్ 370, నీట్ ఫలితాలు, పీఎం కిసాన్ యోజన వంటి అంశాలపైనా భారతీయులు ఎక్కువగా శోధించారు.
సినిమా రంగాల్లో...
సినీ రంగంలో.. కబీర్ సింగ్, అవెంజర్స్-ఎండ్ గేమ్, జోకర్, కాప్టెన్ మార్వెల్ చిత్రాలు... సెర్చ్ ట్రెండ్‌లో టాప్‌గా నిలిచాయి.
ప్రముఖుల్లో...
నెటిజన్లు విపరీతంగా శోధించిన ప్రముఖుల్లో రెండో స్థానం దిగ్గజ గాయని లతా మంగేష్కర్, మూడో స్థానంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారు. తొలిస్థానం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు దక్కింది.