యాపిల్ సంస్థ కనీసం 47 వేల అప్లికేషన్లను చైనాలోని తమ యాప్ స్టోర్ నుంచి తొలగించింది. చైనా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదివరకు యాపిల్ సంస్థ బయటపెట్టిన లొసుగులను తొలగించేందుకు చైనా ప్రయత్నిస్తోందని.. ఇందులో భాగంగానే వేలాది యాప్‌లను చైనీస్ స్టోర్ల నుంచి తీసివేస్తోందని ది ఇన్ఫర్మేషన్ అనే వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది.
"ప్రభుత్వ లైసెన్సులు, చైనాలో స్థానిక భాగస్వాములు లేకుండానే యాప్ స్టోర్ సహా ఇతర సేవలను యాపిల్ నిర్వహిస్తోంది. అమెరికాలో టిక్‌టాక్, వీచాట్‌కు వ్యతిరేకంగా ట్రంప్ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ సంస్థకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి."
-ది ఇన్ఫర్మేషన్
ప్రభుత్వ అంతర్జాల విధివిధానాలకు అనుగుణంగా గత నెలలో 4,500 గేమ్స్‌ను యాపిల్ చైనాలోని తన యాప్‌స్టోర్ నుంచి డిలీట్ చేసింది.
యాపిల్ యాప్ స్టోర్ మార్కెట్‌కు చైనా అతిపెద్ద వనరు. ఏడాదికి 16.4 బిలియన్ డాలర్ల ఆదాయం యాపిల్‌కు సమకూరుతోంది. అమెరికాలో ఆదాయం 15.4 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం చైనాలోని యాపిల్ యాప్ స్టోర్‌లో దాదాపు 60 వేల గేమ్స్ ఉన్నట్లు అంచనా.
బైట్‌డాన్స్(టిక్‌టాక్), టెన్సెంట్(వీచాట్) సంస్థలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల ఇరుదేశాల మధ్య కొత్త వైరుధ్యాలు మొదలయ్యాయి. చైనాకు చెందిన హువావే సంస్థపైనా అమెరికా ఆంక్షలు విధించింది.
ఇవీ చదవండి