ప్రముఖ ఎలక్ట్రానిక్, టెక్ సంస్థలైన యాపిల్, శాంసంగ్‌లు ట్యాబ్లెట్ పీసీ మార్కెట్‌ను ఏలుతున్నాయి. కౌంటర్ పాయింట్ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ట్యాబ్లెట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో 53 శాతం వృద్ధి సాధించినట్లు తెలిసింది. 2020 క్యూ1లో ఈ వృద్ధి కేవలం 19 శాతం కావడం గమనార్హం.
మార్కెట్ లీడర్‌గా యాపిల్..
2021 క్యూ1లో 37 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. శాంసంగ్ 20 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. చైనాకు చెందిన హువావే మూడో స్థానంతో సరిపెట్టుకున్నట్లు తేలింది.
హువావేకు బ్లాక్ లిస్ట్ చిక్కులు..
గత ఏడాది క్యూ1లో హువావేకు 11శాతం మార్కెట్ వాటా ఉంటే.. ఈ ఏడాది అది 5 శాతానికి పడిపోయింది. హువావే సహా పలు చైనా టెలికాం కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఇందుకు ప్రధాన కారణం. బ్లాక్ లిస్ట్‌లో ఉంచిన కారణంగా అమెరికా కేంద్రంగా పని చేసే టెక్ కంపెనీల నుంచి హువావే సాంకేతికత కొనుగోలు చేయలేదు. ఈ కారణంగానే గత ఏడాది నుంచి హువావే కొత్త ట్యాబ్లెట్లను మార్కెట్లోకి తీసుకురాలేదు.
యాపిల్, శాంసంగ్ కొత్త ప్రోడక్ట్‌ల జోరు..
ఇదే సమయంలో.. యాపిల్, శాంసంగ్‌లు కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ.. మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. యాపిల్ గత నెలలోనే ఎం1 చిప్‌తో పని చేసే ఐప్యాడ్ ప్రోను విడుదల చేసింది. శాంసంగ్ కూడా ఐరోపా దేశాల్లో గెలాక్సీ ట్యాబ్ ఎస్7ను అందుబాటులోకి తెచ్చింది. ఐరోపాతో పాటు, ఉత్తర అమెరికాల్లో విద్యా సంస్థల్లో గెలాక్సీ ఎస్7కు మంచి డిమాండ్ ఉంది.
ఈ రెండు సంస్థలు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మరిన్ని కొత్త ఉత్పత్తులతో మార్కెట్లో సందడి చేయొచ్చని పేర్కొంది కౌంటర్ పాయింట్.
ఇదీ చదవండి:5G In India: అయిదోతరం.. ఆందోళన తరంగం