ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. ఆయా ప్రభుత్వ సంస్థల్లో వాటాలు విక్రయించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ ప్రతిపాదన బడ్జెట్ ప్రకటనలో ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ తెలిపారు. ప్రైవేటీకరణపై తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు.
తమ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన బడ్జెట్ ప్రకటనలో ఉందని మేఘవాల్ స్పష్టం చేశారు. ఖాయిలా పడిన, నష్టాల్లో ఉన్న పరిశ్రమలను సకాలంలో మూసివేయడానికి కొత్త యంత్రాంగాన్ని ప్రవేశపెట్టనున్నట్లు విత్త మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలోనే స్పష్టత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తగిన కసరత్తు అనంతరం.. ఆయా సంస్థల మూసివేతకు సంబంధించి సవరించిన విధి విధానాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఖరారు చేసి నోటిఫై చేస్తుందని లిఖిత పూర్వక సమాధానమిచ్చారు మేఘవాల్.
ఇదీ చదవండి: 70 దేశాలకు 5.8కోట్ల భారత టీకాలు: మోదీ