కొవిడ్ మహమ్మారి ప్రజల జీవితాల్లోనే కాదు ఆలోచన ధోరణిలోనూ మార్పులు తెస్తోంది. మహమ్మారి దృష్ట్యా ఆరోగ్యంగా ఉండటం, అనారోగ్యాన్ని తప్పించుకోవటంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా ప్రభావం చూపిన ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు సంబంధించి వారి కలలు, లక్ష్యాలను కాపాడుకోవటం చాలా ముఖ్యమైనవిగా మారాయి.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలకు సరిపడా బీమా తీసుకోవటం ఉత్తమమని చాలా మంది అనుకుంటున్నారు. దీనివల్ల రక్షణ మాత్రమే కాకుండా వారి కోసం రాబడి కూడా సమకూరుతుంది. పిల్లలకు భవిష్యత్తులో విద్యా, ఇతర ఆర్థిక అవసరాలు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని బీమా తీసుకోవాలి. దీనివల్ల పిల్లలు లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడటమే కాకుండా జీవితంలో అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకుంటుందని నిపుణులు అంటున్నారు.
బీమా సంస్థను బట్టి పాలసీలు మారుతుంటాయి. ఆర్థిక పరిస్థితి, తమ అవసరానికి అనుగుణమైన వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పాలసీల గురించి తెలుసుకుందాం.
సింగిల్ ప్రీమియం బీమా పాలసీలు
ఈ పిల్లల పాలసీకి ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పాలసీపై కొన్ని బీమా సంస్థలు డిస్కౌంట్లు కూడా అందిస్తుంటాయి. అదనపు ప్రయోజనాలను బట్టి బీమా పెరగటం, తగ్గటం జరుగుతుంది.
వాయిదా పద్ధతుల్లో ప్రీమియం చెల్లించే పాలసీలు
ఇందులో సాధారణంగా తరచూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెల, త్రైమాసికం, లేదా అర్ధ సంవత్సరం, వార్షికంగా ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. చెల్లించే గడువు పాలసీ తీసుకునే సమయంలో నిర్ణీతమవుతుంది.
ఎండోమెంట్ పాలసీ
ఇందులో బీమా సంస్థ డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంది. వీటిని తీసుకోవటం వల్ల మూలధనం పెరుగుతుంది. అదే సమయంలో ఫండ్ వృద్ధి అనేది రాబడికి జమ అవుతుంది.
యూనిట్ లింక్డ్ బీమా పాలసీలు(యూలిప్‌లు)
పెట్టుబడులతో పాటు జీవిత బీమాను అందించేందుకు ఉద్దేశించినవే యూలిప్‌లు. చెల్లించిన ప్రీమియం నుంచి ఈక్విటీ, డెట్‌లలో పెట్టుబడులు పెడుతుంది బీమా సంస్థ. ఈ పాలసీల్లో రిస్కు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఎండోమెంట్ పాలసీల కంటే ఎక్కువ రాబడిని ఇస్తుంది. వెయిటింగ్ పీరియడ్ అనంతరం ఫండ్లను మార్చుకునే అవకాశం వీటిలో ఉంటుంది.
ఇదీ చూడండి: కరోనా వేళ విద్యా రుణం ఇలా ఈజీగా!