లాక్‌డౌన్ 4.0 వెర్షన్ కొనసాగుతోంది.. కొంత మేరకు సడలింపులు ఇచ్చినా.. ఇప్పటికీ పలు రంగాల్లో ఎక్కువ శాతం మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో చాలామందికి కావాల్సిన ప్రాథమిక వనరు 'వై-ఫై' కనెక్షన్. ఇంట్లో రూటర్ సిగ్నల్స్ జోరుగా ఉంటేనే పని ముందుకు సాగుతుంది. కాన్ఫరెన్స్ కాల్స్ ఆటంకం లేకుండా జరుగుతాయి. అందుకే వై-ఫై వాడకంలో ఈ చిట్కాల్ని పాటించండి.. వర్క్ ఫ్రం హోమ్‌ని ఉల్లాసంగా సాగించండి..
స్పీడ్ ఎంత?
కొత్తగా వై-ఫైతో జతకట్టాలనుకునేవారు.. ఇప్పటికే వాడుతున్నవారు కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం 'హై-స్పీడ్ ప్లాన్'. దీంతో పాటు నెలవారీ డేటా. ఈ రెండు విషయాల్ని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్‌తో చర్చించి మీ వర్క్ ఫ్రం హోమ్ అవసరాలకు తగిన ప్లాన్‌ని ఎంపిక చేసుకోవాలి. కనీసం 8-10 ఎంబీపీఎస్ స్పీడ్ లేకుంటే పని ముందుకు సాగదు. వీడియో కాల్స్ మాట్లాడాలన్నా.. డేటాని షేర్ చేయాలన్నా.. రిమోట్ యాక్సెస్‌లో ఏది చేయాలన్నా హై-స్పీడ్ ఇంటర్నెట్ అనివార్యం.
యాంటెనాలు ఎన్ని?
నెట్‌వర్క్ కనెక్షన్ తీసుకున్నాక వెతికేది రూటర్ గురించే. ఎలాంటి రూటర్ సరైంది? ఏది కొనాలి? కచ్చితంగా రెండు యాంటెనాలు ఉన్న రూటర్‌నే కొనండి. అప్పుడే ఇంట్లో నలుమూలలకీ సిగ్నల్స్ జోరుగా అందుతాయి. అలాగే, ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను వాడుతూ నెట్‌ని యాక్సెస్ చేసేవారికి మరింత ప్రయోజనకరం.
ఎటు పెడుతున్నారు?
రెండు యాంటెనాలు ఉన్న రూటర్‌ని కొంటే.. ఆ యాంటెనాలను ఎల్ ఆకారంలో తిప్పి పెట్టుకోవాలి. అంటే.. ఒకటి నిలువుగా ఉంచితే.. రెండోది అడ్డంగా తిప్పి ఉంచాలి. దీంతో ఇంటి మొత్తం వై-ఫై సిగ్నల్స్ చేరతాయి. నిలువుగా ఉంచిన దాంతో సిగ్నళ్లు గోడల మధ్య సులభంగా ప్రసారం అవుతాయి. అడ్డంగా ఉంచిన యాంటెనాతో పైనా, కిందా అంతస్తుల్లోకి సిగ్నళ్లు ఇట్టే వెళ్లగలవు.
సామర్థ్యం మాటేంటి?
కొత్తది కొందాం అనుకునేవారు కచ్చితంగా డ్యూయల్-బ్యాండ్ మోడల్‌ని ఎంచుకోండి. ఇక సిగ్నల్ ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే 2.4జీహెచ్‌జెడ్ నుంచి 5జీహెచ్‌జెడ్ మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అప్పుడే ఎలాంటి అడ్డంకులు లేకుండా రోజంతా నెట్టింటిని పూర్తి స్థాయిలో వాడుకోవచ్ఛు
ఎక్కడ ఉంచారు?
అన్ని లెక్కలు వేసి రూటర్ ఎంపిక చేసుకోవడం ఒకటైతే.. దాన్ని ఇంట్లో సరైన స్థానంలో పెట్టడం ఎంతో ముఖ్యం. ఇంటి మొత్తాన్ని కవర్ చేసేలా సరైన చోటుని ఎంచుకోండి. రూటర్ ఉంచిన చోట చుట్టూ ఎలాంటి వస్తువులు, ఇతర పరికరాలు లేకుండా చూసుకోండి. అప్పుడే సిగ్నళ్లు స్పష్టంగా అందుతాయి.
ఇదీ చూడండి: నెలరోజుల వరకు రైలు, విమాన ప్రయాణాలు కష్టమే!