దేశంలో ప్రముఖ పాల ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థ అమూల్.. ధరలను పెంచింది. లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచుతున్నట్టు వెల్లడించింది. జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుందని అమూల్ మిల్క్, డైరీ బ్రాండ్ ఉత్పత్తుల సంస్థ- గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) స్పష్టం చేసింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో దాదాపు 19 నెలల తర్వాత ధరలు పెంచినట్లు పేర్కొంది.
''గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్, ఆవు, గేదె పాలు తదితర బ్రాండ్లు అన్నింటికీ పెంచిన ధరలు వర్తిస్తాయి. ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ పెంపు తప్పనిసరి అయింది.''
- ఆర్ఎస్ సోధి, జీసీఎంఎంఎఫ్ ఎండీ
ప్యాకింగ్‌పై అదనపు వ్యయం 30 నుంచి 40 శాతం, రవాణాపై 30శాతం, ఇంధన వ్యయం 30 శాతం పెరగడమూ.. ధరల పెంపునకు మరో కారణమని ఆయన చెప్పారు.
నిత్యావసరాల ధరలు కొండెక్కుతున్న వేళ సామాన్యుడికి.. పాల ధరల పెంపు రూపంలో మరో షాక్ తగిలినట్లయింది.
ఇదీ చదవండి: జులై 1 నుంచి అవి పనిచేయవ్- కొత్త రూల్స్ ఇవే...