ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా యాజమాన్యం పొదుపు చర్యలను చేపట్టింది. అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన విమాన మార్గాన్ని ఎంచుకుంది. ఇకపై ఆ దేశాలకు వెళ్లే విమానాలు హిందూకుష్ పై నుంచి ప్రయాణించనున్నాయి. ఇలా చేయడం కారణంగా సమయంతో పాటు ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చని సంస్థ భావిస్తుంది.
అప్గాన్ గగనతలం మూసివేయడం కారణంగా భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు హిందూకుష్ మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నాయి. ప్రపంచంలోని ఎత్తైన విమాన మార్గాలలో హిందూకుష్ ఒకటిని, ఈ మార్గం ద్వారా నడిపితే సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎయిర్ ఇండియా సర్వీసులలో ఒకటి అయిన టొరంటో నుంచి దిల్లీకి వెళ్లే విమానం ఈ నెల 16న హిందూ కుష్ మార్గంలోనే ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత వారం టొరంటో మార్గంలో నలుగురు పైలట్‌లను అందుబాటులో ఉంచింది.
అఫ్గానిస్థాన్ గగగతలాన్ని మూసివేసిన తరువాత దిల్లీ నుంచి లండన్ చేరుకోవడానికి సుమారు 9.5 గంటలు పట్టేది. కానీ హిందూకుష్ మార్గంలో ప్రయాణించడం వల్ల 8.5 గంటల్లోనే చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎయిర్ ఇండియాకు సుమారు 2.5 టన్నుల ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అఫ్గాన్ రూట్‌తో పోల్చితే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేశారు. గాలి వీచే దాని ప్రకారం 5 టన్నుల వరకు ఇంధనాన్ని పొదుపు చేయవచ్చని వివరించారు.
టాటాలకు సీసీఐ అనుమతి
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100% వాటా, ఎయిరిండియా శాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రై.లి.లో (ఏఐఎస్‌ఏటీఎస్) 50% వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌నకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్‌పై పన్నులు.. కేంద్ర ఖజానాలోకి రూ. 4.55లక్షల కోట్లు