మరికొద్ది రోజుల్లో వేసవి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వేడి నుంచి ఉపశమనం కలిగించే ఎయిర్‌కండిషనర్(ఏసీ)ల ధరలు కొండెక్కనున్నాయన్న వార్త కలవరపెడుతోంది. ధరలు పెరగడానికి ఎయిర్ కంప్రెషర్లపై కస్టమ్స్ సుంకాల పెంపు ఒక కారణమైతే, చైనాలో కరోనా ప్రభావం.. లాజిస్టిక్స్‌పై పడటం మరో కారణంగా కనిపిస్తోంది. భారత్‌లోని పరిశ్రమలకు ఎయిర్ కంప్రెషర్లను అత్యధికంగా సరఫరా చేసేది చైనానే కావడం వల్ల ఈ రంగంపై అధిక ప్రభావం పడుతోంది.
చైనాతో పాటు థాయ్‌లాండ్, మలేసియా నుంచి తయారీదారులు ఏసీ విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన లాజిస్టిక్ ధరల వల్ల ఇన్పుట్ ధరలపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2020 ఏడాది పూర్తిగా సవాళ్లతో కూడుకున్నట్లేనని చెబుతున్నారు.
ఇంట్లో వినియోగించే ఏసీల అమ్మకాలు అత్యధికంగా ఏప్రిల్-జూన్ మధ్య కాలంలోనే జరుగుతాయి. ఈ సమయంలోనే ఇలాంటి ప్రభావం పడటం దురదృష్టకరమని అంటున్నారు నిపుణులు.
"కరోనా వైరస్ కారణంగా విడిభాగాల కొరత ఏర్పడింది. ఉత్పత్తిని కొనసాగించడానికి చైనా నుంచి కీలకమైన విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. కంప్రెషర్లు, ఇతర భాగాలపై కస్టమ్స్ డ్యూటీ అధికమైంది. ఇది కరోనా వైరస్ ప్రభావం మాత్రమే కాదు. దిగుమతి చేసుకునే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ, సముద్ర రవాణా సుంకాలు పెరిగిపోయాయి."
-త్యాగరాజన్, బ్లూస్టార్ ఎండీ
కంప్రెషర్లే కాకుండా కంట్రోలర్లు వంటి ఇతర విడిభాగాల కోసం దేశీయ పరిశ్రమ పూర్తిగా చైనాపై ఆధారపడిందని దైకిన్ ఇండియా ఎండీ కేజే జావా పేర్కొన్నారు.
"ధరలు తక్షణమే 3-5శాతం పెరిగే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడకపోతే ధరలు మరింత పెరగవచ్చు. ఏసీ పరిశ్రమకు మార్చి-జూన్ కాలమే చాలా కీలకం. ఇది చాలా దురదృష్టకరం. ఈ పరిణామాలు పరిశ్రమపై స్వల్ప కాలంలో ఆదాయం, లాభదాయకతలపై ప్రభావం చూపుతాయి."
-కేజే జావా, దైకిన్ ఇండియా ఎండీ
వడ్డన ప్రారంభం
ప్రముఖ ఏసీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఇప్పటికే పెంచేశాయి. బ్లూస్టార్ 3 నుంచి 5 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏసీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న వోల్టాస్ సైతం ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత ధరలు పెంచనున్నట్లు వోల్టాస్ ఎండీ ప్రదీప్ బక్షీ తెలిపారు. 2 నుంచి 3 శాతం మధ్య ధరలను పెంచే అవకాశం ఉందని వెల్లడించారు.
బడ్జెట్ ఎఫెక్ట్!
ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్కండిషనర్లపై ఉన్న సాధారణ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఏసీ తయారీలో వినియోగించే కంప్రెషర్లు, మోటార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఏసీ ధరలో దాదాపు 30శాతం వీటి వాటానే ఉంది. దీంతో అక్కడి ప్రభావం దేశీయ పరిశ్రమపై పడుతోంది.
భారత ఏసీ పరిశ్రమ దాదాపు 4.5 మిలియన్ యూనిట్లుగా ఉంటుందని అంచనా. ఇరవైకి పైగా సంస్థలు ఏసీ రంగంలో పోటీపడుతున్నాయి.