భారతీయ రూపాయి చిహ్నం-₹ 2010 జులై 15న అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఆ సింబల్ డిజైన్ కోసం భారత ప్రభుత్వం పెద్ద పోటీనే నిర్వహించింది. భారత సంస్కృతి, సంప్రదాయాలు, మూలాలు ప్రతిబింబించేలా డిజైన్ రూపొందించాలని ఔత్సాహికుల మెదడుకు పరీక్ష పెట్టింది. ఏకంగా 3 వేలకుపైగా ప్రతిపాదనలు వచ్చాయి. చివరగా ఉదయ కుమార్ డిజైన్నే ఎంపిక చేసింది.
అయితే ఆ రూపాయి లోగో వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి.
1. అంతా తానై..
మొత్తం 3,331 మంది పోటీపడగా.. ఐఐటీ గువాహటి ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ధర్మలింగం పంపిన డిజైన్నే ఖరారు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.
2. దేవనగరి నుంచి రోమన్ వరకు..
భారతీయ కరెన్సీ చిహ్నంలో.. దేవనగరిలో 'ర', రోమన్ లెటర్ 'ఆర్' ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని.. వాటిని కలగలిపి కొత్త చిహ్నాన్ని రూపొందించారు ఉదయ్.
3. సమతుల్య ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించేలా
చట్టం ముందు పౌరులంతా సమానమేనని.. భారత రాజ్యాంగం పేర్కొంది. ఈ సమానత్వం.. మన దేశ కరెన్సీ సింబల్లోనూ ప్రతిబింబించేలా ఆలోచన చేశారు. చిహ్నంలోని రెండు అడ్డ(సమాంతర) రేఖలు.. సమానత్వాన్ని తెలియపరుస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ.. సమతుల్య ఆర్థిక వ్యవస్థ అనే అర్థం కూడా ఇందులో ఉంది.
4. మిగతా దేశాలకు దీటుగా
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి.. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు పరుగులు పెడుతోంది. అందుకే చిహ్నాన్ని అభివృద్ది చెందిన ఇతర దేశాల కరెన్సీని పోలేలా సృష్టించారు. అందుకే వాటిలా సింబల్లో గీతలను తీర్చిదిద్దారు. బ్రిటన్ పౌండ్, యూఎస్ డాలర్, యూరప్-యూరో, జపాన్-యెన్, థాయ్లాండ్-బాట్ ఇలా ఏది చూసినా అందులోనూ ఇలాంటి లైన్లే కనిపిస్తాయి.
5. ష్రియో రేఖ..
హిందీ.. దేవనగరి లిపి నుంచే ఉద్భవించిన విషయం తెలిసిందే. ఇందులో ష్రియో రేఖకు గురించి చెప్పుకోవాలి. హిందీ లిపిలో ప్రతీ పదానికీ పైన ఒక లైన్ ఉంటుంది. దానినే ష్రియో రేఖ అంటారు. అందుకే రూపీ సింబల్కూ పైన అడ్డగీత ఉంటుంది.
6. త్రివర్ణ పతాకాన్ని పోలేలా..
భారత పతాకంలో మూడు రంగులుంటాయి. ఇవి బలం, శాంతి, వృద్ధి, సౌభాగ్యాలకు సూచిక. అందుకే త్రివర్ణ పతాకం విశిష్టత.. భారత కరెన్సీ చిహ్నంలోనూ కనిపించేలా రెండు అడ్డగీతల(కాషాయం, ఆకుపచ్చ) మధ్య తెలుపు వర్ణం ఉంటుంది.
7. సులభంగా ఉండేలా..
భారతీయ రూపాయి సింబల్ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏ డిజైనర్లతోనైనా దీనిని డిజైన్ చేయించడం చాలా సులువు.