వచ్చే ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లలో 12 శాతం వృద్ధిని కచ్చితంగా సాధించి తీరతామని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే వాస్తవానికి జీడీపీ వృద్ధి 10 శాతం మేరకే ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
మందగమనం వల్ల దేశ ఆర్థికవృద్ధి (5 శాతం) 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వృద్ధి పెంపొందించేందుకు ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ తగ్గించింది. ఫలితంగా ప్రభుత్వ పన్ను వసూలు బాగా తగ్గింది. వరుసగా మూడో సంవత్సరం కూడా ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.3 శాతం నుంచి 3.8 శాతానికి సవరించాల్సి వచ్చింది.
విశ్వాసం
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4.23 లక్షల కోట్ల పన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోగలమని పాండే విశ్వాసం వ్యక్తం చేశారు.
"2020-21లో అంచనా వేసిన నామమాత్రపు వృద్ధి (జీడీపీ) 10 శాతం. కనుక ఈ 10 శాతం వృద్ధిపై, పన్ను ఆదాయంలో 12 శాతం సాధించడం సాధ్యమే."- అజయ్ భూషణ్ పాండే, రెవెన్యూ కార్యదర్శి
బడ్జెట్ ప్రకారం
కేంద్ర బడ్జెట్ 2020-21 సంవత్సరానికి స్థూల పన్ను ఆదాయాన్ని రూ.24.23 లక్షల కోట్లుగా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యమైన 21.63 లక్షల కోట్ల కంటే ఇది 12 శాతం ఎక్కువ.
2019-20లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.5.59 లక్షలు వసూలైంది. 2020-21లో ఇది రూ.6.38 లక్షలకు పెరుగుతుందని అంచనా. అంటే ఇప్పటి కంటే 14.13 శాతం అధికం అన్నమాట.
ఈ ఏడు 6.10 లక్షల కోట్లుగా ఉన్న కార్పొరేటు పన్ను ఆదాయం, వచ్చే ఏడాది 11.63 శాతం పెరిగి రూ .6.81 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
సవరణ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పన్నుల వసూలు అంచనాలను ప్రభుత్వం రూ.24.61 లక్షల కోట్ల నుంచి రూ.21.63 లక్షల కోట్లకు తగ్గించింది.
చాలా తేడా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నామమాత్రపు జీడీపీ వృద్ధి 12 శాతంగా ఉంటుందని అంచనా వేస్తే.. అది కాస్తా 7.5 శాతానికి పరిమితమైందని పాండే తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర స్థూల పన్ను ఆదాయం... 2018-19లో వసూలు చేసిన రూ.20.80 లక్షల కంటే 4 శాతం అధికమని పాండే తెలిపారు. వాస్తవానికి 2019-20లో 11 శాతం స్థూల పన్ను ఆదాయ వృద్ధిని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కార్పొరేటు పన్ను కోత కారణంగా 7 శాతం వృద్ధిని వదులుకోవాల్సి వచ్చిందని పాండే తెలిపారు.
పన్ను తగ్గింపు
ప్రస్తుతమున్న సంస్థలకు... బేస్ కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో ప్రకటించింది. 2019 అక్టోబర్ 1 తరువాత విలీనమైన సంస్థలకు, 2023 మార్చి 31 కంటే ముందు ప్రారంభమైన సంస్థలకు... బేస్ కార్పొరేటు పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఆదాయం, కార్పొరేటు పన్ను రేట్లపై విధించే స్వచ్ఛ భారత్ సెస్, ఎడ్యుకేషన్ సెస్ లాంటి అదనపు ఛార్జీలను పరిగణనలోకి తీసుకుంటే..ప్రస్తుత యూనిట్లకు టాక్స్ రేటు 25.17గా ఉంటుంది. ప్రస్తుతం ఇది 34.94 శాతంగా ఉంది. కొత్త యూనిట్లకైతే ఈ టాక్స్ ఇప్పుడున్న 29.17 శాతం నుంచి 17.01శాతానికి తగ్గుతుంది.
ఈ కొత్త పన్ను స్ట్రక్చర్ వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
ఇదీ చూడండి: వైఫై డబ్బా: ఒక్క రూపాయికే 1 జీబీ సూపర్‌ఫాస్ట్ డేటా