నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కేసీఆర్ వెంట తెరాస నేతలు కేశవరావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సంతోష్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీరిని స్టాలిన్‌కు కేసీఆర్ పరిచయం చేశారు.
ప్రధాన వేదికపై జగన్, గవర్నర్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆసీనులు కాగా.... అనుసంధాన వేదికపై ముఖ్య అతిథులు సహా జగన్ కుటుంబ సభ్యులు ఆసునులయ్యారు. జగన్ కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక ముందు వరుస గ్యాలరీలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జగన్ బంధువులు కూర్చొన్నారు. ఏ2 గ్యాలరీలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు కూర్చొన్నారు. బి1 గ్యాలరీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు ఆశీనులయ్యారు. బి2 గ్యాలరీలో బార్ అసోసియేషన్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు.
జగన్‌కు స్టాలిన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి జగన్‌కు డీఎంకే అధినేత స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన స్టాలిన్ జగన్‌కు శుభాకాంక్షలు చెప్పి ముగించారు.
ఇదీ చూడండి : తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ.. "జగన్ ప్రస్థానం"