ఈ- కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్లపై దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారీ రాయితీలతో అమ్మకాలు నిర్వహిస్తున్నాయని వచ్చిన ఆరోపణల ఆధారంగా విచారిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పండుగ సీజన్లో 15 రోజుల వ్యవధిలో ఈ రెండు సంస్థలు సుమారు 3 బిలియన్ డాలర్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇది వారి వార్షిక అమ్మకాల్లో సగానికి సమానం.
"ఈ కామర్స్ సంస్థలకు రాయితీలు, ఉద్దేశపూర్వక ధరలతో అమ్మడానికి ఎలాంటి హక్కు లేదు. తక్కువ ధరలకు ఉత్పత్తులను అమ్మడం వల్ల వర్తక రంగానికి నష్టాలు వచ్చి దెబ్బతింటుంది. అంతేకాదు వాళ్లు సొంతంగా ఉత్పత్తులను కలిగి ఉండేందుకూ వీలులేదు. కేవలం ఉత్పత్తి సంస్థలతో వినియోగదారునికి అనుసంధానం చేయటమే వాళ్ల పని. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు."
-పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రి
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ ఆఫర్ల నేపథ్యంలో జాతీయ వర్తకుల సంఘం విభాగం సీఏఐటీ.. పీయూష్‌కు లిఖితపూర్వక విజ్ఞప్తి చేసింది. ఈ సంస్థలు సొంత బ్రాండ్లను రాయితీల కింద ఇస్తున్నారనీ.. దీనిపై ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.
"అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వ్యాపారాన్ని పూర్తిగా ఆడిటింగ్ చేయాలి. అందులో నిజానిజాలు ఏంటో తెలియాలి."
-సీఏఐటీ
ఇదీ చూడండి: దశాబ్దాల 'అయోధ్య' సమస్యకు పరిష్కారమేమిటో?