హైదరాబాద్ నగరానికి ప్రతి ఏడాది ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా లక్షల్లో విద్యార్థులు వస్తుంటారు. ఇందులో కొందరు ఉద్యోగాలు చేస్తుంటే... మరి కొందరు హాస్టళ్లలో ఉండి కోచింగులు తీసుకుంటారు. ఇలా నగరానికి కొత్తగా వచ్చిన యువతుల అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మానసికంగా, మరికొందరు శారీరకంగా వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఇలాంటి ఆకతాయిల పని పట్టేందుకు గతంలోనే షీ బృందాలను రంగంలోకి దింపారు. ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా... ఎక్కడో చోట వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.
పోలీసులకూ విస్మయం..
ఇటీవల జరిగిన ఓ ఘటన పోలీసులను సైతం విస్మయానికి గురయ్యేలా చేసింది. కొన్ని నెలల క్రితం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. అదే ఇంటర్వ్యూకి వచ్చిన కుల్యన్ స్వామి అనే ఓ వ్యక్తి యువతిని మాటల్లో పెట్టి తన రెజ్యూమ్‌లో ఉన్న ఫోన్ నెంబర్‌ను సంపాదించాడు. తరచూ వాట్సాప్‌లో మెసేజ్లు, ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెకు ఆ కంపెనీలో ఉద్యోగం రాగా.. యువకుడు మాత్రం రిజెక్ట్ అయ్యాడు.
జీతం మొత్తం ఇవ్వాలట..
ఇంకేముంది.. రోజూ ఆఫీసుకు వెళ్తున్న ఆమెను వెంబడిస్తూ.. తన ప్రేమను ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. భయపడిన యువతి ఓకే చెప్పింది. ఇదే అదునుగా చేసుకొని శారీరకంగా కలవమని... రాకపోతే తాము కలిసి దిగిన ఫోటోలు అమ్మాయి తల్లిదండ్రులకు పంపిస్తానంటూ బెదిరించాడు. హోటల్ గదిలో కలిసి ఉన్న దృశ్యాలు రికార్డు చేసి... వచ్చే జీతం మొత్తం తనకే ఇవ్వాలని వేధించాడు.
శరీరంపై బ్లేడుతో రాసి చూపించాలి..
లాక్డౌన్ కారణంగా ఇంటికి వెళ్ళిన ఆమెను శరీరంపై తన పేరు బ్లేడుతో రాసుకుని వీడయో కాల్స్ చేయాలని చెప్పి రాక్షసానందం పొందాడు. వేధింపులు తాళలేక రోధిస్తున్న యువతిని చూసిన సోదరుడు అసలు విషయం తెలుసుకున్నాడు. వెంటనే సైబరాబాద్ షీ టీమ్స్‌ని ఆశ్రయించాడు. బాధితురాలు చెప్పిన వివరాలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సీపీ ప్రత్యేక దృష్టి..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబరాబద్ సీపీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. చదువు పూర్తి చేసుకుని నగరానికి వచ్చి కొత్తగా ఉద్యోగం చేసే యువతులకు సైబరాబాద్ షీ టీమ్స్ తరపున, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగాలు, ట్రైనింగ్ సెంటర్ల వద్ద యువతులు ఎలా మెలగాలి.. ఇలాంటి వారిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఎవరైనా వేధిస్తే ఆలస్యం చేయకుండా.. వెంటనే షీ టీంకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. బాధితుల వివరాలనూ గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తామని పోలీసులు భరోసానిస్తున్నారు.