లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కరోనా సంక్షోభంతో ఉత్పత్తి నిలిచిపోయిందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమని పలు ప్రైవేటు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం. వీటిపై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని కోరింది.
కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయని.. ఈ సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా తమకు వెసులుబాటు కల్పించాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ముంబయికి చెందిన వస్త్రపరిశ్రమ సహా 41 చిన్న వ్యాపార సంస్థలు ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. ప్రైవేటు సంస్థలు లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని మార్చి 29న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీంకు వినతి చేశాయి. అందుకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.
విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 10(2)(i)ని సవాల్ చేశారు పిటిషనర్లు. మార్చి 29న ఎంహెచ్ఏ జారీ చేసిన ఆదేశాలు విపత్తు నిర్వహణ చట్టంలోని ఆర్టికల్ 14, 19(1)(g), ఆర్టికల్ 265, 300లకు విఘాతం కల్గిస్తున్నాయని కోర్టుకు వివరించారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 25ఎమ్ ప్రకారం సహజ విపత్తు కారణంగా ఉద్యోగులను తొలగించే హక్కు తమకు ఉందని పిటిషనర్లు తెలిపారు.