దక్షిణ మధ్య రైల్వే పచ్చదనం-పర్యావరణానికి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ఎన్జీటీ మార్గ దర్శకాలకు అనుగుణంగా సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ స్టేషన్లను ఎకో స్మార్ట్ స్టేషన్లుగా అభివృద్ది చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందుకొచ్చింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ఈ మూడు స్టేషన్లు గ్రీన్ కో సర్టిఫికెట్లను సాధించాయి.
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే గత కొన్నేళ్లుగా 817 కి.మీల మేర రైల్వే పట్టాల వెంట 8 లక్షల చెట్లు నాటింది. అలాగే 706 హెక్టార్ల రైల్వే ఖాళీ స్థలాల్లో 7లక్షల చెట్లను నాటింది. 1,040 కిలోమీటర్ల రైలు మార్గాన్ని విద్యుదీకరణ చేయడం ద్వారా డీజిల్ లోకో పవర్ ఇంజన్ల వాడకం తగ్గించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. పర్యావరణ పరిరక్షణలో 6.6 ఎండబ్ల్యూపి సామర్థ్యం గల సౌర విద్యుత్ వ్యవస్థలు, 8కెడబ్ల్యూపీ సామర్థ్యం గల హైబ్రిడ్ ప్లాంట్లు, 323 సోలార్ వాటర్ హీటర్లు, 430 నేచురల్ డేలైట్ పైపులు, డోములను వివిధ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఇంధన పొదుపు కోసం చేపట్టిన చర్యల వల్ల ఏటా సాలీన 1.95 కోట్ల యూనిట్ల ఇంధనం, రూ.14.06 కోట్ల పొదుపుతో పాటు 18,000 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల తగ్గుతల సాధ్యమైందని రైల్వే శాఖ అధికారులు వివరించారు.
రైల్వే స్టేషన్లు, సర్వీసు భవనాలు, రైల్వే క్వార్టర్లు, ఎల్సీ గేట్ల వద్ద 100 శాతం ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసింది. స్టేషన్లలో సేకరించబడిన వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో వేరుచేసి రీసైక్లింగ్ ప్లాంట్లకు, డీకంపోజింగ్ మిషన్లకు పంపిస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో కూడా ఇలాంటి ఏర్పాట్లే చేశారు. పర్యావరణ హితంగా 14,704 కోచ్లలో బయో టాయిలెట్లను అమర్చారు. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ వంటి 25 స్టేషన్లలో డిస్పోజబుల్ వాటర్ బాటిల్ క్రషింగ్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. మహిళా ప్రయాణికులకు ఉపయోగపడేవిధంగా ప్రధాన రైల్వే స్టేషన్ల వెయిటింగ్ హాళ్లు, కార్యాలయాల్లో సానిటరి న్యాప్కిన్ సినరేటర్లను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్ అమ్మాయిలు ఎందుకు గడప దాటుతున్నారు?