విద్యుత్ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది. ప్రతినెల రూ.కోటి 20 లక్షల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయంటే...బకాయిలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా బకాయిలు పడ్డ సంస్థల్లో అత్యధికంగా ఉన్నవి ప్రభుత్వ సంస్థలే కావడం విశేషం. బకాయిల నుంచి ఉపశమనం పొందేందుకే విద్యుత్ శాఖ అధికారులు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మీటర్లు అందుబాటులోకి రాగానే విద్యుత్ బిల్లును చరవాణి రీఛార్జ్ లాగా ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్పీడీసీఎల్ సంస్థ 2018 సెప్టెంబర్ నెల నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వాడకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11వేల 192 ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసి వాటి పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.
చరవాణి రీఛార్జ్‌లా.. విద్యుత్ రీఛార్జ్
ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లతో విద్యుత్‌ను రీఛార్జ్ చేస్తే..అవి ఏవిధంగా పనిచేస్తాయో..అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ఈవిధంగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లలో రీఛార్జ్ చేసిన విద్యుత్‌ను ఎంతకాలం వాడుకునే అవకాశం ఉంటుందనే అంశాన్ని కూడా సరిచూసుకున్నారు. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లలో రీఛార్జ్ చేసిన విద్యుత్ సరఫరా ఎన్నిరోజులు ఉంటుందనే అంశాలపై అధికారులు ఓ అవగాహనకు వచ్చారు. ఈ మీటర్లకు సంబంధించిన రీఛార్జ్, విద్యుత్ సేవలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు చరవాణికి సంక్షిప్త సమాచారం రూపంలో వచ్చేవిధంగా ఏర్పాట్లు కూడా చేశారు. విద్యుత్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. వీటితోపాటు విద్యుత్ చెల్లింపు కేంద్రాల్లో కూడా విద్యుత్‌ను రీఛార్జ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు అధికారులు తెలిపారు.
మెుదట ప్రధాన పట్టణాల్లో..
ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు తెలిపారు. ముందుగా హైదరాబాద్‌లో ఆ తర్వాత వరంగల్ , హన్మకొండ తదితర ప్రాంతాల్లో కూడా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'అధికారులే ఆత్మబంధువులు... అనాథ అమ్మాయికి పెళ్లి'