రఫేల్ వ్యవహారంపై లోక్సభ మరోసారి అట్టుడికింది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని నరేంద్ర మోదీ రూ.30 వేల కోట్లు అనిల్ అంబానీకి అందేలా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకనుగుణంగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో ప్రధానమంత్రి కార్యాలయం చర్చలు కూడా జరిపిందని విమర్శించింది.
రఫేల్ ఒప్పందంపై పదేపదే చర్చ అవసరం లేదు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ-జేపీసీ ఏర్పాటు చేయండి. మేము అన్నీ అబద్ధాలు చెబుతున్నామని అంటున్నారు. జేపీసీ ఏర్పాటు చేస్తే నిజమేంటో బయటపడుతుంది. ఒప్పందంలోని పూర్తి వివరాలు తెలుస్తాయి. అందుకే మాకు ఎలాంటి వివరణ అవసరం లేదు. జేపీసీ ఏర్పాటు చేయాలన్నదే మా ఏకైక డిమాండ్.
-మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత
కాంగ్రెస్ ఆరోపణలను రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు.
రఫేల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుంటందన్న ఆరోపణలపై జనవరి 4న సభలో వివరణ ఇచ్చాను. ఏదైనా ఒక పని పురోగతిని పీఎంఓ పదేపదే అడిగి తెలసుకోవటం, ఆ పనిలో కలుగచేసుకోవడం జరగదని అప్పుడే తేల్చిచెప్పాం. సభకు ఒక విషయాన్ని గుర్తుచేయదలిచా. గతంలో సోనియాగాంధీ నేతృత్వంలోని ఎన్ఏసీ(జాతీయ సలహా మండలి) పీఎంఓ విషయాల్లో కలుగజేసుకోడాన్ని ఏమంటారు? అది జోక్యం చేసుకోవడమా? ఒకవేళ అది జోక్యం చేసుకోవడమైతే అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడండి.
-నిర్మలా సీతారామన్, రక్షణశాఖ మంత్రి