ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గితే చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై విపక్షాలు కసరత్తులు చేస్తున్నాయి. ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీని కాక తమ కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు సమాచారం.
ఫలితాల అనంతర కార్యాచరణపై ఎన్డీఏయేతర పార్టీలు సమావేశాలు నిర్వహించాయి. ఏం చేయాలనే దానిపై సమాలోచనలు జరిపారు కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీల సీనియర్ నేతలు. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్డీఏ కూటమే గెలుస్తుందని వెల్లడించినప్పటికీ.. మెరుగైన ఫలితం వస్తుందనే ఆశాభావాన్ని ఎన్డీఏయేతర పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ చర్చైనా ఫలితాల అనంతరం వచ్చిన సీట్ల సంఖ్య ఆధారంగానే జరిగే అవకాశం ఉందని విపక్షనేత ఒకరు వ్యాఖ్యానించారు.