భానుడి ధాటికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ వేసవిలో ఇప్పటి వరకు సుమారు 200 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో కూలీలు, ప్రయాణికులే అధికంగా ఉన్నట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లాలో 150 మంది వరకు వడదెబ్బకు గురై ఆసుపత్రుల్లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 50 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 22 మంది, ఆదిలాబాద్లో 14 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి పైగా మరణించినట్లు వైద్యారోగ్య శాఖకు చెందిన ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.
శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 45.8 డిగ్రీలు, వెల్గటూరు, బీర్పూరు, మెట్పల్లి మండలాల్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 45.7, హాజీపూర్, జన్నారం మండలాల్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 44.4, ఖమ్మంలో 43.6, మహబూబ్నగర్, నల్గొండ, భద్రాచలంలో 43.4, నిజామాబాద్, ఆదిలాబాద్లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
మూడురోజులు పాటు వడగాల్పులు
రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవీ చూడండి: ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ముఠా