మెదక్ జిల్లాలోని కొల్చారం, వెల్దుర్తి, గంగాపూర్, చౌట్లపల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున టంకర (మామిడి కాయ చిన్న చిన్న ముక్కలు) వ్యాపారం చేస్తారు. ప్రతి సీజన్లో మామిడి చెట్టు నుంచి కాయల్ని కొనుగోలు చేసి టంకర తయారుచేసి నిజామాబాద్, హైదరాబాద్ మార్కెట్లకు తరలిస్తారు.
గత సంవత్సరం టంకర క్వింటాలకు 25వేల రూపాయలు ఉండగా... ఈ సంవత్సరం 17వేల నుంచి 18వేల మాత్రమే ధర ఉందని ఆవేదన చెందుతున్నారు టంకర తయారీదారులు. దిగుబడి లేక గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని వాపోతున్నారు. కొల్చారంలో ఓ రైతు ప్రతి సంవత్సరం సీజన్లో నెల రోజుల పాటు 50 మందికి ఉపాధి కల్పిస్తాడు. ఈ సంవత్సరం దిగుబడి లేక ఉపాధి కల్పించలేకపోతున్నామని చెబుతున్నాడు.
మామిడ టంకర తయారు చేశాక పీసులను నర్సరీ పెంచే వాళ్లు కొనుగోలు చేస్తారు. కానీ ఈ సంవత్సరం వర్షభావ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వాటిని కూడా కొనేవాళ్లు లేరని టంకరవ్యాపారస్థులు అంటున్నారు. ఇదివరకు ఒక సంచి పీసులను 1000నుంచి 2000 రూపాయల వరకు ఇచ్చి కొనేవారని.. అవి ఇప్పుడు వృథాగా పోతున్నాయని తెలుపుతున్నారు.