తమిళ సూపర్‌స్టార్ కమల్‌హాసన్‌కు నటనతో పాటు అన్ని విభాగాలపై అవగాహన ఉంది. అందుకే ఆయన్ను సకలకళావల్లభుడు అని కూడా అంటారు. 1992లో వచ్చిన 'క్షత్రియపుత్రుడు' సినిమాకు కథను అందించింది కమల్‌హాసనే.
భరతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేషన్, రేవతి, గౌతమి, నాజర్‌లాంటి నటీనటులు నటించి మెప్పించారు. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు సాధించిందీ సినిమా. తాజాగా ఆయన సామాజిక మాధ్యమాల్లో ఏ.ఆర్.రెహమాన్‌తో సంభాషిస్తూ.. ఆయన ఆ సినిమాకు కేవలం ఏడు రోజుల్లో స్క్రిప్టు రాసినట్లు తెలిపారు.
"నేను 'క్షత్రియపుత్రుడు' సినిమాకు స్క్రిప్టు రాస్తున్నప్పుడు, నా స్నేహితుడు ఒకరు ఒక ఛాలెంజ్ విసిరాడు. స్క్రిప్టు తొందరగా రాయి లేదా సినిమా అయినా వదిలేయమని అన్నాడు. దాంతో నేను మీకు స్క్రిప్టు రాసి చూపిస్తానని చెప్పాను. మొత్తం ఏడు రోజుల్లో సినిమా స్క్రిప్టు సిద్ధం చేసి ఇచ్చాను. అయితే అన్ని సినిమాల కథలు ఏడు రోజుల్లో రాయడం అంటే మాటలు కాదు. కొన్ని స్క్రిప్టులు ముప్పై నెలలు సమయం తీసుకుంటే మరికొన్ని సంవత్సరం తీసుకుంటాయి. కొన్నిసార్లు సూట్‌కేసు నిండా డబ్బుపెట్టి స్క్రిప్టు రాయమన్నా అది జరిగే పనికాదు."
-కమల్‌హాసన్, విశ్వనటుడు.
'క్షత్రియపుత్రుడు' సినిమాకు సీక్వెల్ తీయనున్నట్లు 2018లో కమల్ ప్రకటించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తున్నారు.
ఇది చూడండి : 'ఆ సినిమాల్లోని నా యాక్టింగ్ అస్సలు నచ్చలేదు'