భారతీయులకు బంగారమంటే అమితమైన ప్రేమ. అక్షయ తృతీయ నాడు కిటకిటలాడుతున్న ఆభరణాల దుకాణాలే అందుకు నిదర్శనం. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 3250, 22 క్యారెట్ల బంగారం రూ.3,000 పైనే ఉండగా కిలో వెండి సుమారు రూ. 39 వేలు పలుకుతోంది.
గతేడాదితో పోలిస్తే మెరుగైన కొనుగోళ్లు
గత ఏడాది ఎన్నికలు, డీమానిటైజేషన్ ప్రభావం, మార్కెట్ ఒడుదొడుకులతో తాము సవాళ్లను ఎదుర్కొన్నామని వ్యాపారులు తెలిపారు. ఈ సారి సుస్థిరమైన, ఆశాజనకమైన కొనుగోళ్లు జరిగాయన్నారు. అక్షయ తృతీయ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకంతో ఈసారి కొనుగోళ్లలో దాదాపు 18 నుంచి 20 శాతం వరకు పెరిగాయని అంచనా.
ఈ రోజే ఎందుకు?
అయితే బంగారం ధర పెరిగినా, తగ్గినా ఈ రోజు ఎందుకు కొంటారంటే... తమకు అలవాటైపోయిందని కొందరు అంటుంటే... ఎప్పటికైనా విలువ పెరుగుతుంది కానీ తగ్గదు కదా అని మరికొందరు అంటున్నారు. ఇక బంగారు ఆభరణాలు కొనే స్థోమత లేని వారు సెంటిమెంట్‌ను పక్కకు నెట్టకుండా వెండితో సరిపెట్టుకున్నారు.
'పత్తి విత్తనాలే మా పుత్తడి'
ఈ పర్వదినాన చాలామంది పుత్తడి కొనుగోలులో మునిగిపోతే... రైతులు మాత్రం తమ బంగారం
అదేనని పత్తి విత్తనాలను కొంటున్నారు.
అక్షయతృతీయ రోజున బంగారం కొనడం అదృష్టమా, అరిష్టమా అన్న విషయం పక్కనపెడితే... ఈ సెంటిమెంటు పుణ్యమా అని బంగారం షాపుల్లో మహిళలు బారులు తీరారు. మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన సరికొత్త డిజైన్లు, ధరల స్థిరత్వం, వ్యాపారుల ఆఫర్లు, తక్కువ బరువులో అందమైన ఆభరణాలు దొరకటంతో వినియోగదారులు ఈ ఆక్షయ తృతీయ పట్ల బాగానే ఆసక్తి చూపారని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండిః అక్షయ తృతీయ నాడు అప్పు తెచ్చి బంగారం కొనొద్దు