రాష్ట్రంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడానికి మరోసారి అగ్నిమాపక శాఖ సిద్దమైంది. హోటళ్లు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 14 నుంచి 20 వ తేది వరకు వారోత్సవాలు కొనసాగనున్నాయి.
ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన
1944 ఏప్రిల్ 14న ముంబయి డాక్‌యార్డ్‌లో ఒక నౌకకు అగ్నిప్రమాదం సంభవించి విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 14న వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అగ్నిప్రమాదాలు ఎదుర్కోవడం కంటే వాటి నివారణే ఉత్తమం అనే ప్రధానమైన నినాదంతో వారం రోజుల పాటు వారోత్సవాలు కొనసాగనున్నాయి. ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కోసం అగ్నిమాపక శాఖ కరపత్రాలు, గోడపత్రికలు విడుదల చేసింది.
ప్రత్యేక భద్రత కౌన్సిల్ ఏర్పాటు
ప్రస్తుతం రాష్ట్రంలో 118 అగ్నిమాపక కేంద్రాలుండగా...600కు పైగా మంటలను అదుపులోకి తెచ్చే అగ్నిమాపక శకటాలున్నాయి. అయితే మరికొన్ని అగ్నిమాపక కేంద్రాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. జనవరి నెలలో నాంపల్లిలోని నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత అగ్నిమాపక శాఖ మేల్కొంది. జనసందోహం అధికంగా ఉండే ప్రదర్శనలకు...తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందవలసి ఉంటుంది. గతంలో ఈ పత్రం గురించి అధికారులు అంతగా పట్టించుకునే వారు కాదు. మరో వైపు ప్రమాదాల నివారణపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అగ్నిమాపక శాఖ డీజీ గోపీకృష్ణ ఛైర్మన్‌గా భద్రత కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఉంటారు.
అగ్నిమాపక వారోత్సవాల్లో సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు, పాఠశాలల నిర్వాహకులు భాగస్వాములు కావాలని అగ్నిమాపక శాఖ అధికారులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: "మల్లయోధురాలు మహిజ ప్రతిభ"