తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి.. విపక్షాలను కోలుకోలేని దెబ్బతీసిన గులాబీ దళపతి కేసీఆర్... దిల్లీ పీఠం దిశగా వేగంగా పావులు కదిపారు. ఎన్నికలకు ముందే యూపీఏ, ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా దేశ ప్రగతి కోసం... గుణాత్మక మార్పు కోసమంటూ ఫెడరల్ ఫ్రంట్‌కు తెర తీశారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా దిల్లీ కోటపై జెండా ఎగరవేసిన చరిత్ర ఏ జాతీయ పార్టీకీ లేదనే అంశాన్ని కేసీఆర్ బలంగా వినిపించారు. ఇప్పటికీ దేశంలో విద్యుత్, నీళ్లు లేని పల్లెలు ఉన్నాయంటే గత పాలకులైన కాంగ్రెస్, భాజపా పాపమేనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
కేవలం 9 స్థానాలతో సాధ్యమా...?
16 స్థానాల్లో గెలిచి దిల్లీలో కీలక పాత్ర పోషించాలన్న కేసీఆర్ ఆశలపై తెలంగాణ ప్రజలు నీళ్లు చల్లారు. కేవలం 9 స్థానాలకే పరిమితం చేశారు. కేంద్రంలో భాజపా మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో నిలిచిపోతుందని... కాంగ్రెస్ గతం కంటే స్వల్పంగా మెరుగవుతుందని కేసీఆర్ అంచనా వేశారు. అందుకోసమే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేశారు.
తారుమారైన అంచనాలు
కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ అంచనాలు నిజమైనప్పటికీ భాజపా విషయంలో తారుమారయ్యాయి. స్పష్టమైన ఆధిక్యతతో భాజపా మరోమారు ప్రభుత్వాన్ని నెలకొల్పబోతున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఊహించి... కార్యాచరణలోకి తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ ఆచరణ రూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. గుణాత్మక మార్పు నినాదానికి ఆదరణ లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ ఫెడరల్ ప్రంట్‌పై ఇప్పుడు గులాబీ దళపతి వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. తనతో కలిసొచ్చే నేతలతో జాతీయ స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తారా... లేక రాష్ట్రానికే పరిమితం అవుతారా... అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదీ చూడండి : అవకాశం అంతంతమాత్రమే... గెలుపూ అత్తెసరే...!