సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబాయికాలనీలో జరిగిన హత్యలు కలకలం రేపింది. కన్న తండ్రే కాలయముడుగా మారి తన పిల్లల్ని హతమార్చిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బొంబాయికాలనీలో నివాసముండే శిరీష భర్త కుమార్ వేధింపులు భరించలేక... పిల్లల్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వదిలేసి వెళ్లిందనే అక్కసుతో పిల్లల్ని హతమార్చాలని పన్నాగం పన్నాడు కుమార్.
ఒకర్ని కత్తితో.. మరొకర్ని ఉరి వేసి..
ప్రతిరోజు నాయనమ్మ, మేనత్తల వద్ద పడుకునే పిల్లల్ని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. కుమారుడు అఖిల్‌ను కత్తితో గొంతు కోసి హతమార్చి.. చిన్న కుమార్తె శరణ్యను వంట గదిలో ఉరి వేశాడు. పెద్ద కుమార్తె మల్లీశ్వరి గొంతు కోయడానికి ప్రయత్నించగా .. ఆమె తప్పించుకుని నాయనమ్మ వద్దకు చేరుకుంది.
ఈ ఘటనలో అఖిల్, శరణ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ పెద్ద కుమార్తె మల్లీశ్వరిని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పిల్లలను హత్య చేసిన కుమార్‌ను స్థానికులు పట్టుకొని చితకబాది రామచంద్రాపురం పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: కరెంటు వాడకం పల్లెల్లో తగ్గింది నగరాల్లో పెరిగింది