9 నెలల చిన్నారిపై ఆత్యాచారం జరిగిన ఘటన అత్యంత బాధాకరమని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారని వెల్లడించారు. నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని, పాప తల్లిదండ్రులను సర్కారు అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. హన్మకొండలో జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన జరిగిన వరంగల్ ఉమ్మడి జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశానికి మంత్రి హోదాలో హాజరయ్యారు ఎర్రబెల్లి. ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా శాసనసభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సమావేశానికి హాజరయ్యారు. చిన్నారి ఘటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. పాప మృతికి సంతాపంగా సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు. నిందితుడికి సత్వరమే శిక్షపడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా... సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేసింది.
ఇవీ చూడండి: మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం