సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్... స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందిస్తూ సరికొత్త యాప్‌ను మంగళవారం విడుదల చేసింది. 'స్టడీ' అప్లికేషన్ ద్వారా మీ ఫోన్లో ఏ యాప్‌లు వినియోగిస్తున్నారు, అందులో ఎలాంటి ఫీచర్స్ నచ్చాయనే విషయాలు తెలిపితే చాలు మీకు డబ్బులు చెల్లిస్తుంది ఫేస్బుక్. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఐ-ఫోన్ వినియోగదారులకూ ఈ అవకాశం కల్పించనున్నారు.
స్టడీ యాప్ ద్వారా మీరు ఇవ్వాల్సిన వివరాలు
- ఏ యాప్‌లు వినియోగిస్తున్నారు.
- ఎంతకాలంగా వినియోగిస్తున్నారు.
- ఏ ఫీచర్‌ను ఎక్కువగా వాడుతున్నారు.
స్టడీ యాప్ వినియోగదారుల ఐడీ, పాస్వర్డ్ వివరాలను సేకరించబోమని ఫేస్బుక్ తెలిపింది. తరచూ వారి నుంచి పొందే సమాచారం గురించి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేస్తామని స్పష్టం చేసింది.
స్టడీ యాప్ వినియోగించినందుకు ఎంత చెల్లిస్తారనే విషయంపై ఫేస్బుస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ యాప్‌ను అమెరికా, భారత్‌లో మాత్రమే వినియోగంలోకి తీసుకొచ్చారు.
పోటీదారులను ఎదుర్కొనేందుకే ఈ కొత్త యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ఫేస్బుక్ పేర్కొంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌తో మరింత సాంకేతికత జోడించి తమ యాప్‌ను అందరికీ చేరువయ్యేలా చేసేందుకే దీనిని రూపొందించినట్లు తెలిపింది.
గతంలో ఇలాంటి తరహా యాప్‌లనే రెండింటిని ప్రారంభించింది ఫేస్బుక్. 'రీసెర్చ్' పేరుతో ఉన్న యాప్ యాపిల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా ఈ ఏడాది ఆరంభంలో నిషేధానికి గురైంది. 'ఒనావో ప్రొటెక్ట్' పేరుతో ఉన్న మరోయాప్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఫిర్యాదులతో మూతపడింది.
ఇదీ చూడండి: జులై 1 నుంచి ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు తగ్గింపు