కేరళ వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ సేకరించిన... ఈనాడు సహాయనిధితో ఆపన్నులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రూ. 7,76,99,176 సహాయ నిధితో బాధితులకు ఇళ్లు కట్టివ్వనుంది. దీని కోసం కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూపు కుటుంబ శ్రీ తో ఒప్పందం చేసుకుంది. కుటుంబ శ్రీ ప్రతినిధులు, రామోజీ గ్రూప్ తరఫున... ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ వైస్ ప్రెసిడెంట్ రాజాజీ... ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజక్, మరో మంత్రి ఏసీ మొయిద్దీన్ సమక్షంలో ఈ అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా కుటుంబశ్రీ బృందంరామోజీ గ్రూప్ ప్రతినిధులకు నమూనా గృహాన్ని బహూకరించింది.
కేరళ వరదల్లో గూడు కోల్పోయినవారిని ఆదుకునేందుకు గతేడాది... రామోజీగ్రూప్ రూ.3కోట్లతో సహాయ నిధి ప్రారంభించింది. ఒక్క పిలుపుతో ఈనాడుపై ఉన్న అచెంచెల విశ్వాసంతో మానవతావాదులు ముందుకొచ్చారు. వారందరి సహకారంతో ఈనాడు సహాయనిధి రూ. 7,76,99,176 పోగైంది. ఈ మొత్తంతో అలప్పుజ జిల్లాలో 116 ఇళ్లు కట్టించనున్నారు. రూ. 6లక్షల వ్యయంతో... ఒక్కో ఇల్లు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. తొలివిడతగా 40 ఆవాసాల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన కుటుంబశ్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికిశోర్... వాటిని ఈనాడు ప్రతినిధులకు అందించారు. శిక్షణ పొందిన కుటుంబశ్రీ మహిళా కార్మికులే ఈ గృహ నిర్మాణంలో భాగస్వాములవుతారు.