చంద్రబాబు చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో మద్దతు లభించింది. జాతీయ స్థాయి నేతలంతా దీక్షా స్థలికి చేరుకొని... సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను..విస్మరించి.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ వంటి నేతలంతా...మోదీపై ధ్వజమెత్తారు. ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్, కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఆజాద్, శరద్ పవార్, జైరాం రమేశ్ దీక్షా వేదిక వద్దకు వచ్చి మద్దతు పలికారు. పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫోనులో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ ద్వారా దన్నుగా నిలిచారు.
ఎవరేమన్నారంటే....
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ఈ ప్రధాని పెడచెవిన పెట్టారు. దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ఏపీ ఈ దేశంలో భాగంకాదా... ప్రధాని ఎక్కడికెళ్తే అక్కడి పాట పాడతారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండానే అబద్ధాలు చెబుతారు. మోదీకి విశ్వసనీయత లేదు... ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. ఏపీ ప్రజల సొమ్ము దోచి అంబానీకి కట్టబెట్టారు.
-రాహుల్‌గాంధీ , ఏఐసీసీ అధ్యక్షుడు
భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిందే. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి అందరం సహకరిస్తాం.
-మన్మోహన్‌సింగ్, మాజీ ప్రధాని
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వేల కోట్లు నష్టం వచ్చింది. ఇస్తామన్న ఆర్థిక లోటు కేంద్రం భర్తీ చేయలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న పరిశ్రమల హామీ నెరవేర్చలేదు. ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో ఏపీకి ఇచ్చిందేమీ లేదు. ఐదేళ్ల నుంచి ఆంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
-శరద్ యాదవ్, లోక్తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట.
తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి అమలు పరచట్లేదు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ఆప్ మద్దతు ఉంటుంది.
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత
ధర్మపోరాట దీక్షకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. చంద్రబాబు వెంట మేము ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంట నడుస్తోంది. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
-ములాయం సింగ్ యాదవ్
12 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగించగా... రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానీకం దీక్షలో కూర్చున్నారు. రాత్రి 8గంటల సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ చంద్రబాబుతో నిరసన విరమింపజేశారు.