గాల్లోని సూక్ష్మ తుంపర్లలో ఉన్న వైరస్ రేణువులను సూక్ష్మ తరంగాలకు గురిచేసే కొత్త సాధనాన్ని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే వినూత్న విధానాలకు ఇది దోహదపడుతుందని అమెరికన్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ సూక్ష్మ తుంపర్లను ఏరో సాల్స్గా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు.. అతడి శ్వాస, దగ్గు, తుమ్ము నుంచి వెలువడే ఏరోసాల్స్ ద్వారా కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే వెల్లడైంది. భారీ ద్రవాల్లో వైరస్లను నిర్వీర్యం చేయడానికి విద్యుదయస్కాంత శక్తిని వినియోగించే అంశంపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగాయి. అయితే.. ఏరోసాల్స్లోని వైరస్లను అంతమొందించేందుకు సూక్ష్మ తరంగాలు ఉపయోగపడతాయా అన్నదానిపై పెద్దగా పరిశోధన జరగలేదు.
ఈ నేపథ్యంలో వైరస్లతో కూడిన ఏరోసాల్ మిశ్రమంపైకి విద్యుదయస్కాంత తరంగాలను అమెరికాలోని ఎయిర్ఫోర్స్ రీసెర్చ్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అవసరాన్ని బట్టి తరంగాల సామర్థ్యాన్ని హెచ్చుతగ్గులకు గురిచేసేందుకు వీలుగా విద్యుత్, శక్తి, ఫ్రీక్వెన్సీలో మార్పులు చేసే వెసులుబాటు ఇందులో ఉంది. అదే సమయంలో.. పని ప్రదేశంలోకి సూక్ష్మ తరంగాలు విడుదల కాకుండా చూసేలా దీన్ని రూపొందించారు. తాము డిజైన్ చేసిన సాధనం విజయవంతంగా పనిచేస్తే.. అతినీలలోహిత, రసాయన సాధనాల కన్నా వేగంగా శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టేందుకు సూక్ష్మతరంగాలను ఉపయోగించవచ్చని పరిశోధనల్లో పాల్గొన్న బ్రాడ్ హాఫ్ చెప్పారు.
ఇదీ చదవండి: వయస్సులో చిన్నది... ఐక్యూలో పెద్దది