అక్రమ నగదు ప్రవాహంలో చిక్కుకున్న తెదేపా నేత..? తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి నేతలు డబ్బు కట్టలు బయటకు తీశారు. డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు నగరంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లో అనుమాన్పదంగా కన్పించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారించారు. తనిఖీల్లో రూ. 2 కోట్లు బయటపడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో నగదును సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ డబ్బు జయభేరి సంస్థకు చెందినదిగా గుర్తించారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకే...!
డబ్బును యలమంచిలి మురళీ కృష్ణ అనే వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి మురళీ మోహన్‌కు చేరవేయాల్సిందిగా నిందితులను పురమాయించినట్లు విచారణలో వెల్లడైంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టటానికే డబ్బు తరలిస్తున్నారన్న కారణంతో ఇద్దరు నిందితులతో పాటు ఎంపీ మురళీమోహన్, జయభేరి సంస్థకు చెందిన జగన్, ధర్మరాజు, మురళీకృష్ణలపై 171 బి, సి, ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:రేపు నిజామాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం