ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ భాజపా చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే భాజపా కార్యకర్తలు రోడ్లమీదకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్‌డిపోల వద్ద ధర్నా చేస్తూ బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, గ్లోబరీనా సంస్థ ప్రతినిధులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి నిరసన చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేస్తున్నారు.
ముందస్తు అరెస్టులు
కమలం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ద్విచక్రవాహన ర్యాలీలు చేస్తున్నారు. పెట్రోలు బంకులు, దుకాణాలను మూసివేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసులు ముందస్తుగా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేస్తుంటే బలవంతగా అరెస్టు చేస్తున్నారని పోలీసులపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నిచోట్ల పాక్షికం
కొన్ని జిల్లాల్లో బంద్ వాతావరణం పాక్షికంగా ఉంది. ప్రధాన ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో ప్రధాన నేతలను గృహనిర్బంధం చేశారు. కొన్ని జిల్లాల్లో బస్సులు యాథావిధిగా తిరుగుతున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వం తీరుమారంకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా