హైదరాబాద్ హిమాయత్ నగర్లో భారతీయ జనతా పార్టీకి చెందిన రూ. 8 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడాలోని ఇండియన్ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో నగదు తీస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొదట హిమాయత్‌నగర్ పైవంతెన వద్ద కారులో తరలిస్తున్న రూ. 2 కోట్లు పట్టుకున్నారు. ప్రదీప్, శంకర్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బ్యాంకు వద్ద మరో 6 కోట్లు విత్‌డ్రా చేస్తున్నారన్న సమాచారంతో బ్యాంకుకు వెళ్లిన పోలీసులు నగదుతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకే...
అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో భాజపా ప్రధాన కార్యాలయ సహాయకుడు సమ్మత చలపతిరాజు కూడా ఉన్నాడు. పట్టుబడిన సొమ్ము భాజపా అధికారిక ఖాతా నుంచి తీస్తున్నట్లు... భాజపా రాష్ట్ర అధికారి ఆదేశాల మేరకే డబ్బు డ్రా చేసినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం. డబ్బు డ్రా చేసిన చెక్కు మీద భాజపా అధికార ఖాతా నెంబరు, లక్ష్మణ్ సంతకం ఉంది.
మాకు ఇదేం కొత్త కాదు...
భాజపా ఖాతా తమ బ్యాంకులోనే ఉందని... ఇదేం కొత్త కాదని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు. అవసరమైనప్పుడు డబ్బు డ్రా చేసి తీసుకుంటారని తెలిపారు. పార్టీ అధ్యక్షుని సంతకం ఉంది కాబట్టే ఇంత పెద్ద మొత్తం ఇచ్చినట్లు అధికారులు సెలవిచ్చారు.
లెక్కలు చూపటానికి మేం సిద్ధం...
చట్టాన్ని, ఎన్నికల నిబంధనలను తాము ఉల్లంఘించలేదని భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ పేర్కొన్నారు. జనవరి నుంచి పార్టీ సభలకు అయిన ఖర్చులు చెల్లించేందుకే ఈ మొత్తాన్ని డ్రా చేశామన్నారు. లెక్కలు చూపించేందుకు సిద్ధమని కృష్ణసాగర్ స్పష్టం చేశారు.
తుది నివేదిక పరిశీలించాకే...
రూ.8 కోట్ల నగదు దొరికిన ఘటన తమ దృష్టికొచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. పోలీసులు, ఎన్నికల పరిశీలకులు ఇచ్చే తుది నివేదిక పరిశీలించాక గానీ వివరాలు చెప్పలేమన్నారు రజత్.
ఇవీ చూడండి: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం