నేటి తరానికి పొగాకు సేవించడం ఓ ఫ్యాషన్‌గా మారింది. సరదా సరదా సిగరెట్... ఇది దొరలు తాగే సిగరెట్ అంటూ గుప్పున పొగ పీల్చుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది పొగాకు సేవించడం వల్ల మరణిస్తున్నారు. వీరిలో అధికశాతం మన దేశంలోనే ఉన్నారు. భారతదేశంలో రోజుకు 2200 మంది, ఏడాదికి 8లక్షల మంది వరకు పొగాకు వల్ల చనిపోతున్నారు.
పొగాకు సేవనంతో వయసు పెరుగుతుంది
2017లో ఐదేళ్లలోపు చిన్నారులు 6లక్షల మంది వరకు ఈ పొగాకు నుంచి వెలువడే పొగ వల్ల మృతి చెందారు. 40శాతం క్యాన్సర్ వ్యాధులు సైతం కేవలం పొగాకు వినియోగం వల్లే వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. పొగాకు సేవనం వల్ల వయసు పదేళ్లు ఎక్కువగా కనిపిస్తోంది. ధూమపానం వల్లే కాకుండా జర్దా, ఖైనీ, గుట్కా, పాన్ మసాలా రూపంలోనూ పొగాకును నమలడం ప్రమాదకరమని నిమ్స్ ఆస్పత్రి డీన్ పరంజ్యోతి తెలిపారు.
వీధిన పడుతున్న కుటుంబాలు
వాస్తవంగా పొగాకు మన దేశానికి చెందింది కాదు. 400 ఏళ్ల క్రితం మొఘల్ సామ్రాజ్యంలో పలుమార్గాల నుంచి భారత్‌కు దిగుమతి అయి వచ్చేది. ఆ తర్వాత ఇక్కడే పండించడం మొదలు పెట్టారు. క్రమంగా దేశమంతా వ్యాప్తి చెందింది. ధూమపానం, పొగాకు నమలడం వల్ల వచ్చే వ్యాధులను నయం చేయించుకోవడానికి అయ్యే ఖర్చు భరించలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి బానిసలై వీధిన పడుతున్న కుటుంబాలు అనేకం.
రెండో స్థానంలో భారత్
పొగాకు వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో సుమారు 27కోట్ల మంది పొగాకు వినియోగదారులున్నారు. పొగాకు ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబంగ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, కర్ణాటక ఉన్నాయి.
ఇదీ చూడండి: నా ఓటమికి ఆయనే కారణం: వినోద్